ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా..!

జ్ఞానతెలంగాణ,హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, టీ పీసీసీ పోస్టుల భ‌ర్తీ ఆశావ‌హుల‌కు ఆడియాశ‌లు ఎదుర‌య్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్ల‌గానే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై నిర్ణ‌యం వెలువడుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా వాయిదా ప‌డ‌డంతో ఆశావ‌హులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.అయితే ఢిల్లీకి రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ ప్రెసిడెంట్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు పార్టీ హైక‌మాండ్ నుంచి పిలుపు అందింది. శుక్ర‌వారం పార్టీ వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చించాల‌ని హైక‌మాండ్ వారికి సూచించింది. కానీ రేవంత్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డ‌డంతో అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌త ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, టీ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు. కానీ వారి అపాయింట్‌మెంట్ ల‌భించ‌క‌పోవ‌డంతో.. ముఖ్య‌మంత్రి రేవంత్ నిరాశ‌తో హైద‌రాబాద్‌కు తిరిగొచ్చారు. అయితే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ శుక్ర‌వారం ఢిల్లీకి రావాల‌ని ఏఐసీసీ మ‌ళ్లీ ఆదేశించింది. సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్ల‌కుండా హైద‌రాబాద్‌లోనే ఉండిపోయారు. అయితే ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే అపాయింట్‌మెంట్ ఖ‌రారు కాక‌పోవ‌డంతో సీఎం రేవంత్ రెడ్డి, మ‌హేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ల‌లేద‌ని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

You may also like...

Translate »