ఢిల్లీలో బాంబు అలర్ట్ – నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
నిఘా సంస్థల సమాచారం ప్రకారం, ఎల్‌ఈటీ (లష్కరే తోయిబా)కు చెందిన ఉగ్రవాదులు ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ గౌరవ చిహ్నంగా భావించే ఎర్రకోటను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని దుష్ట యత్నం చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అదేవిధంగా పాక్ మసీదు వద్ద జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంగా కొంతమంది తీవ్రవాదులు మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసే అవకాశమున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. భక్తులు అనుమానాస్పద వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఢిల్లీ అంతటా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని పోలీసులు సూచించారు.
