గురు నానక్ జయంతి

మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి, తల్లి తృప్తాదేవి. ఆ గ్రామాన్ని ఇప్పుడు నన్కానా సాహిబ్ అని పిలుస్తున్నారు. నానక్ భార్య సులక్షణ, కుమారులు శ్రీచంద్ర, లక్ష్మీదాస్. నానక్కు బాల్యం నుంచి ప్రశ్నించే, ఆలోచించే తత్వం ఉండేది. గృహస్థాశ్రమం

స్వీకరించిన ఆయనకు సంసారంపై విరక్తి కలిగింది. కుటుంబాన్ని విడిచి తీర్థయాత్రలకు వెళ్ళారు. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీలంక, మక్కా, మదీనా, కాబూల్ మొదలైన ప్రాంతాలు సందర్శించారు. ఈ ప్రపంచానికి శాశ్వతుడు, అనాది, అప్రమేయుడు, సృష్టి స్థితి లయకారుడు అయిన దైవం ఒక్కడే అన్న భావాన్ని ఏర్పరచుకొన్నారు. మక్కాలో ఆయన నిద్రిస్తుండగా తన కాళ్లను పవిత్ర మసీదు వైపు పెట్టుకోవడాన్ని మసీదు పట్ల అగౌరవంగా భావించి ప్రశ్నించగా, భగవంతుడు లేని ప్రదేశం ఎటువైపో చూపమని అడిగితే వారు నిరుత్తరులయ్యారు. మక్కాలో ముస్లిం ఫకీర్ల సమావేశంలో ఆ మత సంబంధమైన దుస్తులు ధరించి పాల్గొన్నారు. గంగానది వంటి పవిత్ర హృదయంతో భక్తి సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నట్టుగా ప్రకటించుకున్నారు. హైందవ-ముస్లిం వర్గాలను ఏకం చేయడం ఆయన ధ్యేయం. నానక్పై కబీర్ బోధనల ప్రభావం అమితంగా ఉండేది. సత్యమే దైవమని ప్రబోధించారు. సామాజిక వర్గాల మధ్య అసమానతలు తొలగించడం, స్త్రీల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం వంటివి సిక్కు మతం ఆ రోజుల్లో బలపడటానికి దోహదం చేశాయి. నానక్ చింతన ద్విముఖంగా సాగింది. అవి భగవంతుడి ప్రకృతి, మానవ స్వభావం. నానక్ దైవాన్ని గురించి చెబుతూ నిరంకార, అకాల్, అలక్ పదాలు వాడారు. నిరంకారుడంటే భౌతిక రూపం లేనివాడని అర్ధం. దాన్నే నిర్గుణతత్వం అంటారు. మనిషి జ్ఞానానికి, అవగాహనకు అందని దైవం. అకాల్ అంటే కాలాతీతుడు. అతడే పరమ పురుషుడు. దేవుడొక్కడే అనే భావాన్ని అలక్ అనే మాట సూచిస్తుంది. మానవుడు అంధ విశ్వాసాల్లో మగ్గిపోతున్నాడని బాహ్య పూజల వల్ల మోక్షం సాధ్యం కాదని భావించారు. మతాధిపతులు మనిషిని జనన మరణం వలయంలో బంధించివేస్తారని ప్రపంచం అంతా మాయ అనే సత్యాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడని, ప్రాపంచిక విలువలన్నీ భ్రాంతి అని నానక్ చెప్పారు. ఆత్మ శుద్ధి వల్ల, సద్గురు బోధనల వల్ల లౌకిక బంధాలు తొలగించుకోవచ్చని అదే మోక్షమని చెప్పారు. ‘సిక్కు’ అంటే శిష్యుడని అర్థం.

ఎంత గొప్పవాడైనా తాను శిష్యుణ్ని అని అనుకోవడంలో వినయం ఉంది. నానక్ అనేక భక్తిగీతాలు రచించాడు. ముల్తాన్, పఠాన్ ప్రాంతాల నుంచి సూఫీ బాబా ఫరీదుద్దీన్ గీతాల్ని, సింధు ప్రాంతంలోని సద్నా, ధన్నా వంటివారి భక్తిగేయాలను మహారాష్ట్రకు చెందిన భక్తగాయకులు నామేవ్, త్రిలోచన్ల, అభంగ్లను ఉత్తర భారతంలోని కబీర్, రవిదాస్ గీతాలను సేకరించారు. తన భావాలు, సమకాలికులైన సంస్కర్తల ఆలోచనల సమ్మేళనంగా ‘గ్రంథ సాహిబ్’కు రూపకల్పన చేశారు. అనంతరకాలంలో ఇతర సిక్కు గురువుల బోధనలు కలిపి రెండు లక్షల పదాలతో 31 అధ్యాయాలతో 1430 పుటలతో గొప్ప అధ్యాత్మిక, తాత్విక సంకీర్తన గ్రంథంగా ‘గురుగ్రంథ సాహిబ్’ అవతరించింది. సిక్కు ధర్మంలో 10మంది గురువులు. 11వ గురువుగా గురుగ్రంథ సాహిబ్ను పరిగణిస్తారు. పంజాబీ భాషకు నానక్ కాలానికి ప్రత్యేకమైన లిపి లేదు. లిపిని రూపొందించే బాధ్యతను తన వారసుడు రెండో సిక్కు గురువు అంగద్కు అప్పగించారు. అంగద్ గురుముఖి లిపిని వ్యాప్తిలోకి తెచ్చారు. గురు ముఖం నుంచి వెలువడిన వాక్యాలని ఈ మాటకు అర్థం.

You may also like...

Translate »