నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టు

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం భారీ పోలీసు బలగాలతో సిట్ అధికారులు జోగి రమేశ్ ఇంటికి చేరుకున్నారు. తొలుత ఆయన అనుచరుడైన రామును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, హైడ్రామా నడుమ జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూనే జోగి రమేశ్ పోలీసు వాహనంలోకి ఎక్కారు.
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్థనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేశ్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్థనరావు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని కీలక ఆధారంగా తీసుకుని సిట్ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.
 
అయితే, ఈ ఆరోపణలను జోగి రమేశ్ మొదటి నుంచి ఖండిస్తున్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రిగా పనిచేసిన కీలక నేత అరెస్టు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

You may also like...

Translate »