శంకర్‌పల్లి శివారులో కత్తులతో బెదిరించి చైన్ స్నాచింగ్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
శంకర్‌పల్లి పట్టణ శివారులో ఓపెన్ లేఔట్‌లో ఒంటరిగా ఉన్న జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు కత్తులతో బెదిరించి బంగారు చైన్ దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఓడిఎఫ్ రోడ్ పరిసర ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకాంత్ గౌడ్ మరియు అతని స్నేహితురాలు ఇస్నాపూర్ నుంచి వికారాబాద్ వైపు ప్రయాణిస్తుండగా శంకర్‌పల్లి పట్టణ శివారులోని ఓపెన్ లేఔట్ వద్ద మూత్ర విసర్జన కోసం ఆగారు. అదే సమయంలో నలుగురు గుర్తుతెలియని దుండగులు రెండు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. వారు ముఖాలకు మాస్కులు ధరించి ఉండగా, జంటను కత్తులు చూపించి బెదిరించారు.
దుండగులు మహిళ మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు చైన్‌ను లాక్కొని అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు శంకర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, డి.ఐ సమరం రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, పరిసర ప్రాంతాల్లోని సమాచారాన్ని సేకరిస్తూ దుండగుల జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును చేవెళ్ల ఏసిపి కిషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు
