“”వారు అమరులు””

తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను– సైమన్‌ కమిషన్‌ రాకను నిరశిస్తూ పంజాబ్‌ కేసరి లాల లజపతిరాయ్‌ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటీష్‌ పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జ్‌ చేయడం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్‌కు నాయకత్వం వహించిన బ్రిటీష్‌ పోలీసు అధికారి స్కాట్‌, సాండర్స్‌లకు బుద్ధిచెప్పాలని నిర్ణయించుకొన్నారు. 1928 డిసెంబర్‌ 17న ఆ ఇద్దరు అధికారులలో ఒకరైన సాండర్స్‌ను హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ ఆర్మీ సభ్యులైన భగత్‌ సింగ్‌, రాజగురు, ఆజాద్‌, జయగోపాల్‌, సుఖదేవ్‌లు వీరోచితంగా హతమార్చారు. ఆ తరువాత 1929 ఏప్రిల్‌ 8న కేంద్ర శాసన సభ(నాటి పార్లమెంట్‌)లో బాంబు విసిరిన సంఘటనలో కావాలనే అరెస్టయ్యారు. పట్టుబడితే ప్రాణం పోతుందని తెలిసీ ఉద్యమ ప్రచారానికి కోర్టు విచారణను వాహికగా మార్చుకోవాలని భావించి అరెస్టయ్యారు. అప్పటి వరకూ మిస్టరీగా ఉన్న సాండర్స్‌ హత్య కేసు భగత్‌ సింగ్‌ దగ్గర దొరికిన పిస్టల్‌తో తేలిపోయింది. ఆ పిస్టల్‌తోనే సాండర్స్‌ను హత్య చేశారని నిర్ధారణ అయ్యింది. అందరూ ఊహించినట్టుగా పార్లమెంట్‌పై దాడి కేసులో భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష పడలేదు. ఆ కేసులో భగత్‌ సింగ్‌, బటుకేశ్వర్‌దత్తులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాని సాండర్స్‌ను హత్య చేసినందుకు ఉరిశిక్ష తప్పలేదు. తమకు క్షమాభిక్ష కోరుతూ భగత్‌ సింగ్‌ తండ్రి కిషన్‌ సింగ్‌ పెట్టుకొన్న దరఖాస్తుపై భగత్‌ సింగ్‌ స్పందిస్తూ ‘పితృ హృదయం పడే బాధను అర్థం చేసుకోగలను. పుత్రవాత్సల్యంతో నాకు వెన్నుపోటు పొడిచారు. నా అభిప్రాయాలను తెలుసుకోకుండా నా తరపున ఆ పని చేసే హక్కు మీకు లేద’ని అన్నాడు.

నిజానికి మార్చి 24న ఉరిశిక్ష అమలుకు సమయ నిర్దారణ జరగగా దేశ వ్యాప్తంగా అలముకున్న ఉద్రిక్తతకు, యువతలో చెలరేగిన ఆవేశానికీ భయపడిన బ్రిటీష్ పాలకులు ముందు రోజు రాత్రే పని పూర్తి చేశారు. చట్టం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఉరితీయడం నిషిద్ధం. అయినా ప్రజల ఆగ్రహానికి దడచిన పాలకులు నడిరాత్రి పూట ఆ యువకిషోరాలను నిర్ధాక్షిణ్యంగా పొట్టనపెట్టుకొన్నారు. అంతేగాక, జైలు ప్రధాన ద్వారం గుండా కాకుండా జైలు వెనుక గోడను బద్దలు కొట్టి ఆ మహావీరుల శవాలను రహస్యంగా బయటకు తీసుకెళ్లారు.

లాహోరుకు చాలా దూరంలోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని హుస్సేనీ వాలా సమీపంలో సట్లేజ్‌ నది వొడ్డున వారి శవాలను దహనం చేశారు. లాహోరు వీధులన్నిటిలో పహరా కాస్తున్న ప్రజలకు ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి వెళ్లే పాటికే అక్కడ ముగ్గురు వీరుల శవాలు బూడిద కుప్పగా మిగిలున్నాయి.

ఆ వీరులను ఉరితీసిన జైలు ఇప్పుడు లేదు. అక్కడో పెద్ద మార్కెట్‌ ఉంది. ఆ ప్రదేశానికి భగత్‌ సింగ్‌ చౌక్‌ (షహీద్‌ చౌక్‌) అని పేరు పెట్టారు. ఆ మహా వీరుల్ని దహనం చేసిన హుస్సేనీ ప్రాంతాన్ని 12 గ్రామాలను ఇవ్వడం ద్వారా 1961లో పాకిస్థాన్‌తో మార్పిడి చేసుకొంది మన ప్రభుత్వం. ఈ ప్రదేశంలో భటుకేశ్వర దత్తుని ఆయన కోరిక మేరకు దహనం చేశారు. భగత్‌ సింగ్‌ తల్లి కోరిక మేరకు 1968లో ఇక్కడో స్మారక స్థూపంతో పాటు వారి విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే, 1971 యుద్ధ సమయంలో వీటిని తొలగించి తీసుకెళ్లిన పాకిస్థాన్‌ పాలకులు నేటికీ తిరిగివ్వలేదు.

ఏ పార్లమెంట్‌లో భగత్‌ సింగ్‌ బాంబులేశాడని శిక్ష విధించారో అదే పార్లమెంటు భవనంలో 15 ఆగస్టు 2008న 18 అడుగుల భగత్‌ సింగ్‌ కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.‘సౌశీల్యం కలవారికి విషం అమృతంలా, మేరు పర్వతం చిన్న రాయిలా, పాము పూలదండలా, సింహం లేడి పిల్లలా కనపడుతుందని’ భర్తృహరి చెప్పింది ఈ వీరులకు సరిగ్గా సరిపోతుంది.

(భగత్‌సింగ్‌, ఆయన సహచరులను ఉరితీసి నేటికి 94 సంవత్సరాలు)

ఆ వీరులకు ఘనంగా నివాళులు అర్పిద్దాం

You may also like...

Translate »