బోధి అంటే ఏమిటి? బోధిని పొందడమెలా?

బోధి అంటే ఏమిటి… ? బోధిని పొందడమెలా…?


బుద్ధుడు మేధోపరంగా,నైతికంగా అత్యున్నత స్థాయి అయిన బోధి స్థితిని అందుకున్నారు.బోధిస్థితిని మానవులు కృషి ద్వారా సాధించవచ్చు.బోధిస్థితిని సాధించిన వారందరిలోకి మహావ్యక్తి బుద్ధుడు.బుద్ధునికి ముందు చాలామంది బుద్ధులు ఉన్నారని బుద్ధుడే అన్నారు.మానవులు దుక్ఖం నుండి విముక్తి పొందడానికి దారి చూపిన మార్గదర్శి బుద్ధుడు.ఎవరి విముక్తికి వారే కృషి చేయాలని బుద్ధుడు చెప్పారు.భగవాన్ బుద్ధుడు’వ్యక్తిగా నా జీవితానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా, తన బోధనలు పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలని’ తన శిష్యులను హెచ్చరించారు.అంతమాత్రాన బుద్ధుని జీవితం ప్రాధాన్యత లేనిది కాదు.బుద్ధుడు తాను తొలుత ఆచరించి ఆ తరువాత మాత్రమే తన శిష్యులకు మరియు జనానికి బోధించారు.అసలు సిసలైన గురువు బుద్ధుడు.తాను స్వపరిశీలన ద్వారా తానెరిగిన మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి,మార్గదర్శిగా నిలిచిన మహనీయుడు..గురువు అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తూ,దుక్ఖం అనే తిమిరం నుండి నిబ్బాణం అనే వెలుగు వైపు నడిచే మార్గాన్ని ప్రబోధించాడు.మార్గదర్శినే కాని మోక్షదాతను కానని ప్రకటించాడు.మనందరికీ బుద్ధుడు ఆదర్శప్రాయం.బుద్ధుణ్ణి మనం అనుసరించాలి.

గౌతమ బుద్ధునికి పూర్వం బుద్ధులు ధర్మాన్ని బోధించేవారు ఈ విషయాన్ని గౌతమ బుద్ధుడు ప్రస్తావించారు. బుద్ధులు బోధించిన ధర్మాన్ని బుద్ధ ధర్మం అంటారు బౌద్ధ ధర్మాన్ని శాక్యముని సిద్ధార్థ గౌతముడు స్థాపించారు. సిద్ధార్థ గౌతముడు మానవాళికి సద్ధర్మ సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. బుద్ధుడు బోధిని పొందారు. బుద్ధుడు పొందిన బోధికే సమ్మా సంబోధి లేక పరిపూర్ణ జ్ఞానోదయం అని పేర్లు ఉన్నాయి.బోధిని పొందిన సిద్ధార్థ గౌతముడు బహుజన హితం కోసం బహుజన సుఖం కోసం కృషి చేశారు. మానవాళి దుక్ఖాన్ని నిర్మూలన చేయుట కొరకు మార్గాన్ని చూపారు.

బోధి అనగా నేమి?

పరిపూర్ణమైన బుద్ధి ,నైతిక ప్రవర్తనల మేలు కలయికనే బోధి అంటారు. బోధి అనగా మేల్కొనుట, అవగాహన, అర్థం చేసుకొనుట, జ్ఞానోదయం పొందుట,పరమ జ్ఞానం, జాగరికమవుట అని అర్ధాలు ఉన్నాయి.ఈ బోధి అనే పదం బుద్ధ అనే క్రియారూపం నుండి ఉద్భవించింది. బుధ్ అంటే తెలుసుకోవడం అని అర్థం.

శాక్యముని సిద్ధార్థుడు బోధిస్థితిని పొందెను. మన చరిత్రలో బోధిస్థితిని పొందిన వారిలో సిద్ధార్థ గౌతముడే సుప్రసిద్ధుడు. బోధిని పొందిన వ్యక్తులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. బోధిని మానవ ప్రయత్నం వలన ద్వారా సాధించవచ్చు.

బోధిని ఎలా పొందగలం?

మనందరం కూడా బోధిని పొందొచ్చు. బోధిని గనుక మనం పొందాలనుకుంటే మనలో ఉన్నతమైన జీవిత ఆదర్శం,ఉన్నతమైన జీవిత విలువలు గల ఆలోచనలు కలిగి ఉండాలి. నిరాడంబరమైన జీవితానికి మనం అలవాటు పడాలి. మన దైనందిన జీవితంలో పూర్తిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించగలగాలి. మన జీవితాన్ని ప్రశాంతత వైపు మనమే నడుపుకోవాలి. నిర్మలమైన మనసుతో జీవించాలి. గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉంటే సరిపోదు. గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించడం కోసం చిన్న చిన్న లక్ష్యాలను స్వచ్ఛందంగా వదిలిపెట్టేయగలగాలి.

బోధిని గృహస్తులు సైతం పొందవచ్చు. చాలామంది బోధిని సాధించాలంటే లేదా ఆ వైపుగా నడవడానికి తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని ఆచరించలేమో!, భిక్షువులుగా మారిపోవలేమో! అని అనుకుంటున్నారు.నిజానికి సంసార జీవితంలో ఉన్న వాళ్ళు సైతం మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోవచ్చు. భార్యాభర్తలు గృహస్తులు అందరూ కూడా జీవితంలో ప్రశాంతంగా ఉండొచ్చు. జీవితంలో బోధిని సాధించడానికి లేదా ప్రశాంతతకు ఆరోగ్య వంతమైన లైంగిక జీవితం ఎన్నడూ ఆటంకం కాదు.కాకపోతే జీవితం పట్ల అవగాహన లేక ఒకరినొకరు అవసరాలకు మోసగించుకోవడం వలనే మనశ్శాంతి అనేది నేడు కరువైపోతుంది. లైంగిక జీవితం లేనిచో సృష్టే ఉండదు కదా! ఈ సందర్భంగా ఒకటి మన అర్థం చేసుకోవాలి సిద్ధార్థుడు జన్మించి ఉండేవారా లైంగిక జీవితమే బోధికి అడ్డంకి అని అనుకుంటే. లేదు కదా కాబట్టి బ్రహ్మచర్యమే బోధిస్థితికి అసలైన మార్గమని ఆలోచన సరికాదు.

బౌద్ధంలోనే సిద్ధాంతాలు ఒక కులానికో, ప్రాంతానికో, జాతికో,దేశానికో, మతానికో సంబంధించినవి .కావు అలాగే లింగ బేధం లేకుండా విశ్వమంతా వర్తించేవి.
బౌద్ధాన్ని ఆచరించడం కోసం మన జీవితంలో బంధాలను తెంచుకోనక్కర్లేదు.బంధనాలలో ఉన్న అతి మమత్వం, అహం, ద్వేషం, స్వార్థం వంటివి వదులుకుంటే సరిపోతుంది.ప్రకృతికి ఎవరూ విరుద్ధంగా జీవించకూడదు. క్రమశిక్షణ కలిగి ఉంటూ అందరం కూడా ధర్మంలో ప్రశాంతంగా జీవించవచ్చు.

బోధిని సాధించాలంటే ఏం చేయాలి?

  • బోధిని సాధించాలంటే దుష్ట చింతనకు స్వస్తి పలకాలి.
  • మనసును స్వచ్ఛమైన నీటిలాగ ప్రశాంతత కలిగిన మానసిక స్థితియే పరమ లక్ష్యంగా చేసుకోవాలి.
  • ఇతరులను నిందించడం, ఇతరులను చులకనగా చూడడం మానుకోవాలి. అలాగే ఇతరుల గురించి చెడు ప్రచారం కూడా మానేయాలి.
  • ఎప్పుడూ కూడా ఎవరికీ చెడు తలపెట్టకూడదు. ఎవరికీ కూడా మనం కష్టాన్ని కలిగించే పనులు చేయకూడదు.
  • మనలో నిరంతరం మంచితనాన్ని పెంచుకోవాల.
  • మన శక్తిని వృధా చేయకూడదు.
  • మనలోని అదుపులేని కోరికలను ఆవేశాలను గమనించుకుంటూ వాటిని అదుపులోకి తెచ్చుకోవాలి.స్వీయ నిగ్రహాన్ని కలిగి ఉండాలి.
  • మనం ఎవరిపైనో ఆధారపడి పరాన్న భుక్తులు, పరాన్న జీవుల్లాగా బతికేయకూడదు.
  • తృష్ణను నిరోధించుకోవాలి. రాగద్వేష మొహాలను నశింప చేసుకోవాలి.
  • సోమరితనం బద్దకం వంటివి మన దరి చేరకుండా జాగ్రత్తపడాలి.
  • అహంకారాన్ని ప్రదర్శించకూడదు.
  • చెడు ఆలోచనలను పూర్తిగా దూరం చేయాలి.
  • సందేహాలు ఉంటే గురువులు ద్వారా వాటిని నివృత్తి చేసుకోవాలి. అసంతృప్తిని అధిగమించాలి.
  • ముఖ్యంగా బోధిని సాధించాలనుకుంటే మనం మోసం చేసే అలవాటును వదులుకోవాలి. ధర్మాన్ని కలిగి ఉండాలి.
  • తప్పుడు పనులు చేయటాన్ని అవమానంగా భావించాలి.
  • జ్ఞానాన్ని ఆర్జించాలనే తృష్ణను కలిగి ఉండాలి.
  • కష్టాలకు కృంగిపోవడం సంతోషానికి పొంగిపోవడం వంటి స్వభావం కలిగి ఉండకూడదు.
  • కష్టమైన పనులను సైతం చేయడానికి సిద్ధం కావాలి.
  • మనసు నిండా ప్రేమ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోరాదు.

అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది

You may also like...

Translate »