వీధులను శుభ్రపరిచే సునీతుడు గొప్ప బౌద్ధ భిక్షువు అయ్యెను.

వీధులను శుభ్రపరిచే సునీతుడు గొప్ప బౌద్ధ భిక్షువు అయ్యెను.

జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్షుచి:

సనాతన బ్రాహ్మణ సిద్ధాంతమైన వేదాంతం ప్రకారం “ఎవరూ శూద్రులకు మత విషయమై సలహాలివ్వటం గాని, ధర్మ బోధన గాని చెయ్యరాదు.” అని రెండు సార్లు జన్మించిన ద్విజ కులాలకు మాత్రమే విముక్తి పొందటానికి అర్హులని ప్రకటించింది.బౌద్ధ ధర్మం ఒక్కటే జ్ఞానం మరియు ధర్మం విషయంలో ఎలాంటి వివక్ష చూపలేదు. కులంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా విముక్తి మార్గంలోకి ఆహ్వానించింది.భగవానుడు తన భిక్ఖు సంఘంలోకి కుల భేదాలు పాటించకుండా అందరికీ అవకాశం ఇచ్చారు.రాజగృహ నగరంలో పాకీపనివాడు సునీతుడు.ఉదయాన్నే భిక్షాపాత్రతో భగవాన్ బుద్ధుడు తన శిష్య పరివారంతో రాజగృహ నగరానికి విచ్చేయగా,అంతట సునీతుడు నగర వీధులను శుభ్రపరుస్తూ, చెత్తాచెదారం అంతా కుప్పలు పెట్టి ఆ చెత్త కుప్పలను కావడికెత్తుకొని మోసుకెళుతూ ఉన్నాడు.ఆ సమయంలో బుద్ధుని మరియు అతని శిష్యులను చూసి మిక్కిలి సంతోషానికి లోనయ్యాడు.ఆనాటి సాంప్రదాయం ప్రకారం సునీతుడు భగవాన్ బుద్ధుడు మరియు అతని శిష్య పరివారానికి కనపించరాదు. దీంతో తాను మోస్తున్న గంపను అక్కడే వదిలేసి గోడకు అనుకోని భగవానునికి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు.

భగవాన్ బుద్ధుడు ‘సునీతా…! ఎంతకాలమని ఈ హీనమైన గృహస్త జీవితాన్ని గడుపుతావు.ఈ గృహస్త జీవితాన్ని విడిచిపెట్టి మా భిక్షు సంఘంలో చేరగలవా? ‘ అని అడుగగా…సునీతుడు ఆనందంతో పరవశించిపోయాడు.రాజ వైభోగాలను వదిలేసుకొని బుద్ధుడు త్యాగం ముందు నేనెంతటి వాడిని అని సమాధానం ఇచ్చాడు.భిక్షు సంఘంలో నాలాంటి వాళ్ళను కూడా చేర్చుకుంటారా అని సునీతుడు అడిగాడు.భగవానుడి ఆహ్వానం మేరకు సునీతుడు కాషాయ వస్త్రాలు ధరించి భిక్షాపాత్రతో భిక్షు సంఘంలో చేరాడు.సునీతుడిని విహారానికి తీసుకుని వెళ్ళి భగవానుడు సద్ధమ్మం మార్గం గురించి ఉపదేశించారు.’నియమ మార్గానుసరణ ద్వారానే స్వార్థరహితుడవు అవుతావు, పవిత్రుడవు కాగలుగుతావు’ అని చెప్పారు.”భగవాన్ బుద్ధుడు సునీతుడు వంక చూసి ఇలా పలికారు “నా ధర్మాన్ని ఆశ్రయించు. మత నిష్టలను చిత్తశుద్ధితో పాటించు. తెలివితేటలు ఉంటే ఎవరైనా నిర్వాణాన్ని సాధించవచ్చు. కులంతో పనిలేదు. నిర్వాణం ఏ ఒక్క కులం ప్రత్యేక సౌకర్యం కాదు.గాలి అన్ని కులాలకు సమానం.అదేవిధంగా నా మార్గాన్ని అందరూ అనుసరించవచ్చు.”భగవాన్ బుద్ధుని శిష్యులు సునీతుడు గొప్ప భిక్షువు ఎలా కాగలిగాడని అడుగగా “పేరుకు పోయిన పెంటకుప్పపై మొలచే పూలచెట్టు ఎంతటి తీయని సువాసనలు వెదజల్లే పుష్పాలను పూస్తుందో, అలాగే ప్రాపంచిక విషయలోలురై అంధకారంలో ఉంటున్న మలిన జీవుల నుండి బుద్దుని కుమారులు (భిక్షువులు) అనబడే వారు పుట్టి ప్రకాశించగలర”ని సమాధానం చెప్పారు.

– అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది

You may also like...

Translate »