అంగ రంగ వైభవంగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు

అంగ రంగ వైభవంగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు


11వ తేదీ నుండి 17 వరకు బ్రహ్మోత్సవాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం అయినాయి. దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది ఒడ్డున.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోకకైలాసమే శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగం రూపంలో కొలువైతే, పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది. భూలోక కైలాసంగా గుర్తింపు పొందిన శ్రీక్షేత్రంలో ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను… మొదటి ఉత్సవాలను సంక్రాంతి సమయంలో… రెండోసారి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి సమయంలో నిర్వహిస్తారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 11న ప్రాంభమై, 17 తో ముగుస్తాయి.

తెలుగు నేలపై కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం: జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే గిరి శృంగం మీద వెలసిన పరమ పవిత్ర స్థలంగా భాసిల్లుతున్న క్షేత్రం. పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవది, శ్రీభ్రమరాంబా దేవికి నెలవైన శక్తిపీఠం. శైవక్షేత్రాల్లో తలమానికం. మల్లికార్జున మహాలింగ చక్రవర్తి కొలువై ఉండి, సకల లోకారాధ్యంగా, త్రైలోక్య పూజితంగా విరాజిల్లు తున్నది. సంకల్ప, పూజా సందర్భాలలో శ్రీశైలానికి ఏ దిగ్బాగంలో ఉన్నామో భగవంతునికి తెలియ చేసుకునే సాంప్రదాయాన్ని బట్టి క్షేత్ర ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది.
పురాణాల్లో వర్ణితమైనఎనిమిది శృంగాలతో, నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలతో, చంద్ర, సూర్య కుండాది పుష్కరిణులతో, లతలు, వృక్ష సంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు కలిగి శ్రీశైల మల్లన్న దేవుని సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ వేదఘోషను ప్రతిధ్వ నింప చేస్తూ, పాతాళగంగ నామాంకిత అయిన కృష్ణవేణీ నది ఈ ప్రదేశంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసా ల్లోనూ శ్రీశైల వైభవం వర్ణించ బడింది. కృతయుగంలో హిరణ్య కశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడు. పురాణాల ప్రకారం సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు భక్తితో స్థాపించిన సద్యోజాత లింగం, పంచపాండవ లింగాలు పూజార్హత కలిగి అలరారు తున్నాయి. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్రాన్ని గురించిన వర్ణనలున్నాయి. పలు భాషల కవులు క్షేత్ర ప్రాధాన్యతను అభివర్ణించారు.

స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆది శంకరులు కొంత కాలం ఇక్కడ తపస్సు చేసి, శివానంద లహరిని రచించి, మల్లి కార్జునుడికి సమర్పించి, భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురుచరిత్ర చెబుతోంది. నృసింహ సరస్వతి స్వామి ఇప్పటికీ కదళీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తాత్రేయ భక్తులు విశ్వసిస్తారు.

శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి మఠాలలో ఉన్న సాధకులు, యోగుల వసతి కోసం క్రీస్తుపూర్వం నుంచి అనేక రాజవంశాలు ఎన్నో దానాలను గావించి నట్లు శిలాశాసనాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతులైన మల్లికార్జునుణ్ణి దర్శించి భక్తుల సౌకర్యాలకు ఎన్నో ఏర్పాట్లు, అశేష వస్తుసంపదలు సమర్పించారు.

శ్రీశైలంలో పంచ మఠాలు ప్రాచీన మైనవి. మొదటిదైన ఘంటామఠం – శ్రీశైల ఆలయానికి వాయువ్య దిశగా ఉంది. శివ సాధకుడైన ఘంటాకర్ణ సిద్దేశ్వరుడు తన శిష్యులతో కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రెండోదైన విభూతి మఠం, శ్రీకృష్ణ దేవరాయల కాలపు వీరశైవుడైన శాంతి మల్లయ్య అనే వ్యక్తి పేరు మీదుగా ఏర్పడినట్లు పరిశోధనలు వివరిస్తున్నాయి. మూడోదైన రుద్రాక్ష మఠాన్ని మల్లి శంకరస్వామి అనే భక్తుడు నిర్మించాడని తెలుస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు అతడు రుద్రాక్షలను పంచిపెడు తుండేవాడని స్థానికులు చెబుతుంటారు. నాలుగోదైన సారంగ మఠాన్ని సారంగేశ్వరముని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దీనికి సంబంధించిన లిఖిత ఆధారంగా క్రీ.శ.1585 నాటి శాసనం మఠంలో లభ్యమైంది. అయిదోదైన నంది మఠంలో నందికేశ్వరుడు అనే యోగి సుదీర్ఘకాలం జీవించాడు. ఇది ఘంటా మఠానికి వైపు ఉండేది. ఇవే కాకుండా శ్రీశైలంలో పలు మఠాలు ఉండేవి. వాటిలో వీరశైవ సిద్ధాంత భిక్షావృత్తి మఠం ప్రసిద్ధమైంది. క్రీ.శ. 1518లో దీనిని సిద్ధ భిక్షావృత్తి భార్య, శిష్యుడు పర్వతయ్యలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి చాలాకాలం ముందే 3వ కుళోత్తుంగ చోళుడు ఒక మఠాన్ని క్రీ.శ. 1178-1216 మధ్య కాలంలో ఏర్పాటు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. వటసిద్ధి మఠం, చంద్రమఠం, కమరీ మఠం అనే మఠాలు భక్తులకు అన్నవసతి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అనేక మఠాలు పదహారో శతాబ్దికి పూర్వం నుంచే ఇక్కడ ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న
శ్రీశైల క్షేత్రంలో శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయినాయి.

పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని, ప్రధాన వీధులను విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. అలాగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు స్వాగతం పలుకుతూ శ్రీశైలం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు రహదారి మార్గంలో స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. భృంగివాహనసేవ, రావణ వాహనసేవ, నంది వాహనసేవ, స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం, కైలాస వాహనసేవ, యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోణ కార్యక్రమాలు, 17 వ తేదీన జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 17 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవలను నిలిపి వేశారు. దేవస్థానం ఈవో శ్రీనివాస రావు ఆధ్వర్యంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


రామ కిష్టయ్య సంగన భట్ల
9440595495

You may also like...

Translate »