సంతోషంగా జీవించగలిగితే దానికి మించిన సంపద ఏముంటుంది.?

సంతోషంగా జీవించగలిగితే దానికి మించిన సంపద ఏముంటుంది.?

మనం సంతోషంగా జీవించాలి అంటే మన మీద మనకు నిఘా ఉండాలి. మన మీద మనకు ఎల్లప్పుడూ నిఘా లేకపోతే మన జీవితం దుక్ఖ మయం అవుతుంది. తథాగత గౌతమ బుద్ధుడు ఈ విషయం గురించి ఈ విధంగా ఉపదేశించడం జరిగింది. అప్పమాదో అమతపదం పమాదో మచ్చునో పదం అప్పమత్తాన మీయన్తి యే పమత్తా యథామతా పై పాళీ భాషలోని వాక్యాలు ధమ్మపదమ్ లోనివి.బుద్ధుడు మానవాళి సంతోషంగా జీవించాలి అని కోరుకున్నారు. మానవులు తమ స్వార్ధ కోరికలు వలనే జీవితాన్ని దుక్ఖ మయం చేసుకుంటున్నారు.దీనినే బుద్ధుడు ఇలా చెప్పారు. ‘అప్రమత్తంగా జీవించడం అంటే జాగ్రత్తగా జీవించడం వలన అమృత పదమ్ లభించును.ప్రమత్తతతో జీవించడం అంటే జాగృత్త లేకుండా జీవించడం వలన మృత్యువుకు చేరువు అవుతాం.’

కాబట్టి మనిషి ముఖ్యంగా తెలివిగా ఉండాలి. తెలివిగలవాళ్ళు ఎప్పుడూ తమ మీద తాము నిఘా పెట్టుకుంటారు.అలా ఉంటేనే మనకు మేలు చేసుకోగలం.ఎవరైతే జాగ్రత్తగా జీవిస్తారో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండరు.శరీరం పట్ల కూడా మనం ఎరుక కలిగి ఉండాలి.శారీరక సుఖాలు, శారీరక పరమైన కోరికలు వలన కూడా మనిషి కొద్ది పాటి ఆనందం పొందుతారు తప్ప ఆ పొందే ఆనందం ఎక్కువ కాలం ఉండదు.చిత్త శుద్ధి అనేది మనిషికి మంచిది.చిత్త శుద్ధి లేని మనిషి జీవితం నరకం.మనిషి సోమరితనం వదులుకుని జీవించాలి.సత్య మార్గంలో నడుచుకుంటూ ఉంటే మనిషికి ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. మనిషి మనసును అదుపులోకి తెచ్చుకోవాలని తథాగతుడు చెప్పారు. మనిషి యొక్క మనసు కోతి వలె చిందులు వేసే స్వభావం గలది.కోతి లాంటి మనసును మనిషి మావటివాడు బలమైన ఏనుగును అదుపులోకి తెచ్చుకున్నట్లు దారితప్పుతున్న మనసును సరైన దారిలోకి తెచ్చుకోవాలి.

సంతోషంగా జీవించాలి అంటే:-

అసలు మనిషికి దుక్ఖం ఎందుకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనిషి లో ఉండే స్వార్థం వలనే.మనిషి కోపంతో ,గర్వంగా ఉండటం వలన మనిషికి ప్రశాంతత ఉండదు.బంధనాలు తెంచుకుని జీవించాలి. పేరు ప్రఖ్యాతలు కోసం, కీర్తి కండూతి పిచ్చి పట్టడం వలన కూడా మనిషికి సంతోషం అనేది ఉండదు.కాబట్టి మనిషి వీటికి అతీతంగా జీవించాలి అని బుద్ధ భగవాన్ బోధించారు.ధమ్మపదమ్ లో బుద్ధుడు ఈ విధంగా బోధించారు.”క్రోధం జహే విప్ప జహేయ మానంనఞ్ఞోజనం సబ్బమతిక్కమేయ్యతం నామ రూపస్మిం అసజ్జమానంఅకిఞ్చనం నామపతన్తి దుక్ఖే”ఈ వాక్యాలకు అర్థం ఏమనగా కోపాన్ని వదులుకుని,గర్వాన్ని అణచివేయాలి.బంధనాలు తెంచుకోవాలి. పేరు ప్రఖ్యాతలు కోసం ప్రాకులాడుతూ ఉండకూడదు. ఇలా ఎవరైతే జీవిస్తారో వారికి ఆనందం నీడలా వారి వెంటే ఉంటుంది.మానవ జీవితంలో సుఖం, దుక్ఖం సహజం…మనుషులు దుక్ఖం వస్తే తట్టుకోలేరు,సుఖం వస్తే ఎంతగానో ఆనందిస్తారు.ఒక నాణేనికి రెండు వైపులా సుఖం, దుక్ఖం ఉంటాయి. ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండరు.కుటుంబం, సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి ఉంటారు.మనిషి ఒక సామాజిక జంతువు.మన జీవితంలో కొన్నిసార్లు అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. దీంతో మనం విచారంగా ఉంటాం.నిరాశకు లోనవుతాం..ఇలాంటి సమయంలోనే మనిషిలో నైతికత దెబ్బ తినడానికి అవకాశం ఏర్పడుతుంది. మన జీవితంలో ప్రతిసారీ సంతోషం ఉండాలి అని అనుకోవద్దు. భగవాన్ బుద్ధుడు చెప్పిన ఈ మాటలను మనం సదా మననం చేసుకోవాలి. “చింతించకు నేను పర్వతంలా నీ వెనుక నిలబడి ఉన్నాను.”మనం జ్ఞానం వైపు నడవాలి, వినయాన్ని అలవర్చుకొని జీవించాలి. అప్పుడే దుక్ఖానికి లోనుకాకుండా జీవించగలం.బుద్ధ భగవాన్ చెప్పిన మాటలను ఆచరించడం ద్వారా ఆనందం మన సొంతం అవుతుంది.శాంతిని అనుభవించగలం.బుద్ధ భగవాన్ చెప్పినట్లు “పెద్ద పెద్ద శారీరక రోగాలన్నీ మానసిక రోగాల నుండే పుట్టుకొస్తాయి. అన్ని మానసిక రోగాలు రాగ ద్వేషాల వల్లే జనిస్తాయి.” కాబట్టి మనం మనసులో ఎలాంటి చెడు బుద్ధి లేకుండా ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉందాం.”ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించే వారిలో నేను కూడా ఒకణ్ణి.”

-తథాగత గౌతమ బుద్ధుడుమనిషి జీవితంలో సంతోషం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంతోషం లేని మనిషి వేటి మీదా ఆసక్తి కనబరచలేడు.నిద్ర సరిగ్గా పట్టక సతమతమవుతాడు బ్రతకడం ఒక భారంగా భావిస్తాడు. ప్రతి క్షణం ఆ మనిషి జీవితం కడు బాధాకరంగా మారుతుంది. మనిషి సంతోషాన్ని ఒక్కోదాంట్లో వెతుక్కుంటూ ఉంటాడు.చివరకు ఆ సంతోషం లభించక మదనపడతాడు. ఆందోళన చెందుతాడు.తప్పిదాలు కూడా చేస్తాడు. తథాగతుడు సంతోషాన్ని పొందడం ఎలా అనేది బోధించారు. ఈ ప్రపంచం సంతోషం కోసం ప్రాకులాడుతుంది.ఈ వాస్తవాన్ని బుద్ధుడు గుర్తించారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మన గురించి కూడా మనం ఏమిటన్నది తెలుసుకోవాలి అని భగవానుడు చెప్పారు. సమాజంలో పరిస్థితి పట్ల పూర్తి ఎరుకతో మనం మసలుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉండవచ్చు. ఇష్టం లేని ఉద్యోగం చేయాల్సి రావడం, ఇష్టం లేని భర్త లేదా భార్యతో కొందరు జీవించాల్సి రావడం వలన అలాగే సమాజంలో కులం కారణంగా కోరుకున్న అతను లేదా ఆమెతో జీవించలేని పరిస్థితి దాపురించడం వలన జీవితం దుక్ఖమయం అవుతుంది. జీవితంలో రుచి ఉండదు.మానసికంగా బాధ అనుభవించాల్సి వస్తుంది. ఇదే దుక్ఖం. ఈ దుక్ఖం పట్ల కోపం ,ద్వేషం సహజంగా మనిషిలో కలుగుతుంది. ఈ దుక్ఖం మనిషి లో ఆందోళన, వ్యాకులత కలిగిస్తుంది. మనిషి దుక్ఖం పట్ల అసహనాన్ని ,ఆందోళనను ,ద్వేషాన్ని కలిగి ఉండరాదు అని బౌద్ధం చెబుతోంది. దుక్ఖం పట్ల ద్వేషం పెట్టుకోవడం వలన దుక్ఖం సమసిపోదు. మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది అని బౌద్ధం చెబుతోంది. దీనికోసం తెలివితో ,సహనం తో వ్యవహరించాలని బౌద్ధం చెబుతోంది. భగవానుడు సుఖ సంతోషాలు గురించి చెబుతూ సుఖసంతోషాల కోసం నేరుగా వెంపర్లాడటం వలన అవి మనకు లభించవని తెలియజేసారు. ఎవరైతే వ్యక్తిగత కోరికలు సంతృప్తి పరచుకోవాలి అని తాపత్రయ పడతారో వాళ్ళు చిక్కుల్లో పడతారు. వ్యక్తిగత కోర్కెలను తీర్చుకోవాలని అదే పనిగా మనిషి జీవించడం ధర్మం కాదని భగవానుడు చెప్పారు. జీవితంలో కష్టాలు అనివార్యంగా వస్తుంటాయి పోతుంటాయి.ఈ కష్టాలను ఎవరైతే ఎదుర్కొంటూ ముందుకు సాగుతారో వాళ్ళు మహత్తరమైన ఆనందాన్ని పొందుతారు అని బుద్ధుడు చెప్పారు. ఉన్నది ఉన్నట్లు చూడటం వలన ఆనందం లభిస్తుంది. మనలో ఎలాంటి ఆందోళన, వ్యాకులత కలుగదు. ఎంతటి కష్టాలు వచ్చిన చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ గొప్ప ఆనందానుభూతిని పొందవచ్చు. దానికి భగవాన్ బుద్ధుని జీవితం ఒక ఉదాహరణ.బుద్ధుడు రాజ్యాన్ని, సకల సుఖాలను త్యజించారు. జ్ఞానోదయం కోసం ఏడు సంవత్సరాల పాటు ఎన్ని కఠిన పద్ధతులు అవలంభించారో.ఎంతగా కష్టాలు పడినారో అంత మాత్రాన ఆయన ఆనందం పొందకుండా ఉన్నారా? లేదు కదా ఆయన ఈ కష్టాలను ఎదుర్కొంటూ మహత్తర ఆనందానుభూతిని పొంది మనకు ఆ ఆనందాన్ని పొందే మార్గాన్ని గురించి బోధించారు. బౌద్ధులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఉండాలి కూడా. యథాభూత జ్ఞానం కలిగి ఉంటే ఇది మనకు కూడా సాధ్యమే.బౌద్ధ భిక్ఖువులు చాలా స్వచ్ఛమైన మనసు తో ఉంటారు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటారు.భిక్ఖువుల ఇంద్రియాలు కూడా వేటి వేటి కోసమో వెతకడం జరగదు.వాళ్ళ ఇంద్రియాలు సంతృప్తి చెంది ఉంటాయి. భిక్ఖువులు ఇంత సంతోషంగా ఎందుకు ఉంటారు అంటే బుద్ధ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వలనే.బుద్ధ ధర్మాన్ని స్వయంగా అనుభూతి చెందుతూ ఆనందంగా ఉంటారు.టిస్సవిజ్జ భగవాన్ బుద్ధుని ధమ్మ బోధనల్లో మూడు నియమాలు కలవు.ఈ నియమాలు.మానవులను పునీతులుగా చేసేందుకు అవసరం.ఈ మూడు ధమ్మ నియమాలను పాళీ భాషలో ‘టిస్సవిజ్జ’ అని అంటారు.

(1).నిత్య చలిత ధమ్మ నియమం : ఏదీ ఆగకసాగిపోతుంటుంది.

(2).దైనందిన జీవితంలో వ్యక్తి యొక్క కమ్మను అనుసరించి అనగా ఒక వ్యక్తి నైతికతను అనుసరించి మంచి పనులకు మంచి ఫలితం, చెడు పనులకు చెడు ఫలితం ఉంటుంది.

(3).కాలానుగుణంగా ఏర్పడు సంఘటనలు కారణంగా వ్యక్తికి కలిగే మేలు,కీడు.దీనినే పటిక్క సముప్పద సిద్ధాంతం అంటారు.ఈ మూడు ధమ్మ నియమాలను తొలుతగా గుర్తించినదీ మరియు వాటికనుగుణంగా నడుచుకొన్నదీ భగవాన్ బుద్ధుడు,ఆనాటి బుద్ధుని శిష్యులైన సాటి భిక్షువులు..ఎవరైనా సరే ఈ మూడు ధమ్మ నియమాలను గుర్తించి, వాటికనుగుణంగా నడుచుకోవడాన్ని బట్టి వ్యక్తి యొక్క జీవన గమనం పురోగమిస్తుంది.తుదకు రాగద్వేషమోహాదులను అధిగమించి,సమస్త బంధనాలను చేధించుకొని నిర్వాణ పథానికి చేరువ అవుతారు.ఇదే వ్యక్తికి విమోచన అంటే..ఇది ఎవరికి వారు సాధన చేయడం ద్వారా నిరంతరం కృషి చేయడం ద్వారా తెలుసుకోగలుగుతారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ శీల సమాధి ప్రజ్ఞలను ఆచరించి తన అనుయాయులందరినీ ఆచరించాలి అని కూడా ప్రబోధించారు.”

శీలము – సమాధి – ప్రజ్ఞలు మనకు గంగా యమునా సరస్వతులు.ఈ త్రివేణీ సంగమంతోనే మనకు నిర్వాణ ప్రాప్తి కలుగుతుంది.” కల్యాణ మిత్ర ఆచార్య సత్యనారాయణ గోయంకా అన్నారు.

-అరియ నాగసేన బోధి M.A.,M.Phil.,TPT.,AP SET.,L.L.బి బౌద్ధాచార్య & న్యాయవాది

You may also like...

Translate »