బుద్ధ ధమ్మం…

– అరియ నాగసేన బోధి,ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది
జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్షుచి :
భగవాన్ బుద్ధుడు ఉన్నతుడు, అర్హతుడు,మహాజ్ఞాని..బహుజనుల హితం కోసం, బహుజనుల సుఖం కోసం, ఈ లోకం మీద దయతో, మానవుల యొక్క జీవితానికి అర్థాన్ని కల్పించడం కోసం ఈ భూమ్మీద ఉద్భవించిన పుద్గగలుడు( మహానుభావుడు) తథాగత గౌతమ బుద్ధుడు.
బుద్ధ అనేది పాళీ భాషలోని పదం.ఈ పదం బుధ్ అనే క్రియా ధాతువు నుండి వచ్చింది. బుద్ధ అనే పదానికి అవగాహన చేసుకొనుట, మేల్కొనుట అని అర్థం. సిద్ధార్థుడు స్వయం కృషితో బుద్ధుడయ్యాడు.చతురారియ సత్యాలను అంటే నాలుగు అరియ సత్యాలను పూర్తిగా సిద్ధార్థుడు అర్థం చేసుకొని,ఈ అవిద్యా ప్రపంచం నుండి మేల్కొనడం వలనే బుద్ధుడిగా పిలవబడుతున్నాడు.చతురారియ సత్యాలను అర్థం చేసుకొని అంతటితో ఆగిపోకుండా ధమ్మాన్ని విశ్లేషణ చేసి ఇతరులకు జ్ఞానోదయం చేశాడు. అందుకే సమ్మా సంబుద్ధుడయ్యాడు.చాలామంది బుద్ధులు ధమ్మాన్ని అర్థం చేసుకున్నారు జనాలకు బోధించలేకపోయారు. అయితే బుద్ధుడు తాను ఎరిగిన ధమ్మాన్ని తొలుత తాను ఆచరించి జనాలకు ఉపదేశించాడు.
మనిషికి అసంతృప్తి,కష్టాలు, బాధలు స్వార్థం వలనే వస్తాయని ఆనాడే భగవాన్ బుద్ధుడు చెప్పారు. మనం ప్రశాంతంగా జీవించాలంటే మనలోని స్వార్థాన్ని విడిచిపెట్టాలి.ఇంద్రియ సుఖాల కోసం జీవించడం మానేయాలి.

“పవిత్ర సద్ధర్మాన్ని పాటించిన
సుఖశాంతులు నీ సొంతమవును;
తృష్ణ వలలో చిక్కావా,
దుక్ఖం నిను వెంట తరుమును.”
-భగవాన్ బుద్ధ
మనిషి జీవితంలో ఏర్పడే దుక్ఖాన్ని ఎలా నిర్మూలించుకోవాలో తెలియజేస్తోంది బౌద్ధం.అన్ని రకాల దుక్ఖాల నుండి పూర్తిగా స్వేచ్ఛను అంటే విముక్తిను పొందటమే బౌద్ధం యొక్క పరమ లక్ష్యం. అయితే మరి ఈ దుక్ఖాన్ని ఎలా నిర్మూలన చేయాలి ? స్వార్థ పూరితమైన ఆరాటం, తపన వంటి వాటిని పూర్తిగా మనలో లేకుండా తొలగించుకోవాలి. స్వార్థ పూరితమైన ఈ కోరికలు వలనే మనలో దుక్ఖం కలుగుతుంది. నేను ,నాది అనే స్వార్థం వలన మనలో తీవ్రమైన కోరికలు కలుగుతాయి. ఈ తీవ్రమైన కోరికలు వలన మనలో దుక్ఖం కలుగుతుంది. మరి పూర్తిగా దుక్ఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి? దానికి ఒకే ఒక దారి ఉంది. అదేంటంటే “ఎల్లప్పుడూ మంచి పనులను చేయాలి. చెడు పనులు చేయకుండా ఉండాలి.”
తథాగత బుద్ధ ఇలా చెప్పారు “తాను తప్పు చేశానని తెలిసి పశ్చాత్తాపం చెందని మనిషి మనసులోకి సముద్రంలోకి చేరే నీరులా చెడు ఆలోచనలు పరుగెత్తుతాయి.దుర్భుద్ది బలపడితే దాన్ని వదిలించుకోవడం ఇంకా కష్టం.దుష్ప్రర్తన కలిగిన వ్యక్తి తన తప్పులను గుర్తించగలిగితే,వాటిని క్రమంగా అంతమొందించగలుగుతాడు.”
మనిషిని ఎక్కువగా బాధించేవి ఏమిటంటే? జీవులను చంపటం అంటే మూగజీవాలను తన ఆనందం కోసం చంపటం మాత్రమే కాదు, సాటి మనిషిని మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ బాధించడం కూడా ఒక తప్పుడు పని.అలాగే ఇతరులు ఇవ్వని దానిని తీసుకోవడం అంటే దొంగతనం చేయడం ,కామసుఖాల్లో మునిగి తేలడం చెడు ప్రవర్తన ఇవన్నీ మన శరీరాన్ని తృప్తి పరచడం కోసం చేసేవి.ఇంకా అబద్ధాలు ఆడటం, తగవులు పెట్టడం (తంపులమారి మాటలను మాట్లాడడం) ,ఇతరులను కించపరచడం, కాలక్షేపం కబుర్లతో సమయాన్ని వృథా చేయడం లాంటి పనులు మనం వాక్కుతోటి చేస్తుంటాం.పిసినారితనం,ద్వేషం,చెడు ఆలోచనలు చేయడం లాంటివి మానసిక రోగాలు.ఈ పది పనులను చేయకుండా ఉంటే మనిషికి ఆనందం లభిస్తుంది అని తథాగతుడు దశకుశలాలు బోధించారు.ఈ పది పనులను ఎవరైతే చేయకుండా ఉంటారో వారికి మేలు చేస్తోందని, అతిక్రమించి నడుచుకుంటే అతనికి కీడు చేస్తోందని తథాగతుడు చెప్పారు.

– -అరియ నాగసేన బోధి,ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది
