మనిషి గొప్పతనం అతను పుట్టిన కులంలో లేదు.

కొందరు పరిచయస్తులు ,కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు నన్ను తరచూ అడిగే ప్రశ్నలు : ‘మీరు ఏ కులం వారు (మీరు ఏవుట్లు) మీది బౌద్ధమతమా?

అరియ నాగసేన బోధి:’నేను నన్ను మనిషిగా భావిస్తున్నాను, ఎందుకంటే ఆకాశం కింద మనం ఒకే కుటుంబం మాత్రమే, మనం భిన్నంగా కనిపిస్తాము.’

మనందరిదీ ఒకటే కులం అదే మానవ కులం…ఈ కులాలు మనుషులను ఎక్కువ తక్కువ అంటూ అణచివేతకు గురిచేస్తాయి..మానవత్వం లేకుండా చేస్తాయి.బౌద్ధ ధమ్మం మనుషులను మనుషులుగా చూస్తుంది. కులాలు బట్టి మనుషులను చూడని ధమ్మం ఇది.హెచ్చుతగ్గులు చూడకుండా మనుషులను చూడాలి అయితే కొందరు కులవాదులు ,సంపన్నులు బౌద్ధ ధమ్మంలో చేరి కులాన్ని బట్టి, సంపద ,అధికారం ,పదవులు బట్టి మనుషులను చూస్తున్నారు.ఇది బౌద్ధ ధమ్మానికి విరుద్ధం..

బుద్ధుడు దృష్టిలో బహుజనులకు హితం చేస్తే అది మంచి కర్మ.బహుజనులకు అహితం అంటే చెడు చేస్తే అది దుష్కర్మ.భగవాన్ బుద్ధుడు అనాధ పిండకుని విహారంలో ఉండగా భిక్షాటన కోసం ఉదయం పూట శ్రావస్తి పట్టణానికి వెళ్ళారు.భిక్ష కోసం ఇంటింటికి వెళ్తున్న సమయంలో అగ్నికుడు అనే ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందరకు వచ్చారు.అక్కడ అగ్నికుడు యజ్ఞం కోసం యజ్ఞ గుండంలో సమిధలు వేస్తూ మండిస్తున్నాడు.యజ్ఞం కోసం అవసరమైన సామాగ్రిని సిద్దం చేస్తున్నాడు.అటువైపుగా గౌతమ బుద్ధుడు రావడం చూసిన అగ్నికుడు కోపంతో “ఓ బోడి గుండు భిక్షకుడా! అక్కడ ఆగు …దౌర్భాగ్యుడా..కులహీనుడా ..అక్కడే ఆగు.ముందుకు రావొద్దు.” అంటూ కించపరుస్తూ తిట్టాడు. బుద్ధుడు దానికి సమాధానంగా “ఓ బ్రాహ్మణా! కులహీనుడు అంటే ఎవరో నీకు తెలుసా? అసలు ఎవరిని కుల హీనుడని అంటారో, ఏ పరిస్థితుల్లో కులహీనుడు అవుతాడో నీకు తెలుసా? అని ప్రశ్నించారు.అప్పుడు అగ్నికుడు నాకు తెలియదు అంటాడు.అప్పుడు బుద్ధుడు కులహీనుడు అని ఎవరిని పిలుస్తారో వివరిస్తారు.
కోపంతో ఎవరైతే సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారో వారే కులహీనులు.సాటి మనుషులను ఎవరైతే దుర్బుద్ధితో హీనంగా చూస్తారో వాళ్ళే నిజమైన కులహీనులు.ఇతరుల పట్ల తప్పుడు బుద్ధిని కలిగి ఉంటారోవాళ్ళే కులహీనులు.జాలి,దయ అనేది లేకుండా మూగ జీవాలను,సాటి మనుషులను హింసిస్తారో వాళ్ళే కులహీనులు.ఒక మనిషి మరొక మనిషిని బాధ పెట్టినా ,పక్క వారి గ్రామాలను,వాడలను నాశనం చేసినా వాళ్ళు కులహీనులు అవుతారు.దొంగతనాలు చేసే వాళ్ళు,తనకు ఇవ్వని దానిని తీసుకుంటారో వాళ్ళే కులహీనులు.అప్పులు చేసి ఆ అప్పులు తీర్చకుండా పారిపోతారో ,అలాగే నా అప్పు తీర్చు అంటే నేను నీకు బాకీ లేను అంటూ దబాయిస్తారోఅలాంటి వాళ్ళే అసలైన కులహీనులు.స్వార్థంతో దారిన పోయే వారిని దోచుకుంటారో వాళ్ళు కులహీనులు.తమ స్వార్థం కోసం డబ్బుకు ఆశ పడి అబద్ధపు సాక్ష్యాలు చెప్పే వాళ్ళు కులహీనులు.అలాగే ఇష్టపూర్వకంగా గానీ లేదా ఇతరులచే ప్రేరేపించ బడి కానీ స్నేహితుల,మంచి చెప్పే వాళ్ళ భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళు కులహీనులు ,దౌర్భాగ్యులు.ముసలితనంతో ఉన్న తల్లిదండ్రులను ఎవరైతే తన దగ్గర డబ్బులు ఉండి కూడా పట్టించుకోరో వాళ్ళు కులహీనులు.మంచి కోసం వచ్చిన వాళ్ళకు చెడు చెప్పే వాళ్ళు కులహీనులు.పుట్టుకను బట్టి ఎవరూ కులహీనులు కారు.అలాగే పుట్టుకను బట్టి ఎవరూ బ్రాహ్మణులు కారు.” బుద్ధుని మాటలు విన్న అగ్నికునిలో పశ్చాత్తాపం కలిగి తొందరపడి బుద్ధుణ్ణి తిట్టినందుకు తలవంచి ,సిగ్గు పడ్డాడు.

ఆనాడు బ్రాహ్మణులు చాతుర్వర్ణ వ్యవస్థను ప్రవేశ పెట్టారు.దీని ప్రకారం పుట్టుకకు ప్రాముఖ్యత ఇచ్చారు.ఈ సిద్దాంతం అత్యంత మూర్ఖ సిద్దాంతం.అసలు పసలేనిది.పుట్టుకతోనే ఎవరూ గొప్ప వాళ్ళు కారు.అలాగని చెడ్డ వాళ్ళు కారు.బుద్ధుడు ఆనాడు ఈ చాతుర్వర్ణ సిద్దాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఒక మనిషి యొక్క గొప్పతనం అతని గుణంలో ఉంటుంది కానీ పుట్టిన వర్ణం లేదా కులం బట్టి ఉండదు అని బుద్ధుడు చెప్పారు.”ఒక వ్యక్తి పుట్టుకను బట్టి గాక అతని గుణాలను బట్టి గౌరవించాలి.” గౌతమ బుద్ధుడు అన్నారు. చాలామంది ఈ విషయాన్ని పక్కన పెట్టి కులాన్ని బట్టి మనిషిని గౌరవించడం చేస్తున్నారు.
కులం ఒక మానసిక రోగం.ఈ కుల జబ్బును వదులుకోవాలి.కులాంతర వివాహాలు జరగాలి.కులం పరిధి దాటి మనం జీవించాలి.

మనిషికి శీలమే ప్రధానం.

ఒకసారి భగవాన్ బుద్ధునికి-అశ్వలాయనుడు అనే బ్రాహ్మణునికి మధ్య జరిగిన సంభాషణలు గురించి తెలుసుకుందాం….

అశ్వలాయనుడు అనే బ్రాహ్మణుడు ‘మనిషి యొక్క పుట్టుకను బట్టి, అతని వర్ణాన్ని బట్టి గొప్పతనం ఉంటుంది అని బలంగా నమ్మి,అదే చెప్పేవాడు. అశ్వలాయనుడు ప్రకారం ‘పుట్టుకను బట్టి బ్రాహ్మణులు మాత్రమే శ్రేష్టులు.’ అని అంటాడు.

భగవాన్ బుద్ధుడు మాత్రం ఇది పూర్తిగా అసత్యం అంటారు. అశ్వలాయనుడు యొక్క అభిప్రాయంతో ఆయన ఏకీభవించలేదు.మనిషిని పుట్టుకను బట్టి, అతని వర్ణాన్ని బట్టి కాకుండా అతని యొక్క గుణగణాలను బట్టి మాత్రమే చూడాలని అంటారు. గొప్పతనం అనేది పుట్టుకను బట్టి, పుట్టిన వర్ణాన్ని బట్టి రాదు అని అన్నారు.

మనుషులకు శీలమే ప్రధానం.ఒక మనిషిని అంచనా వేయడానికి శీలం ముఖ్యం.శీలం వలనే ఒక వ్యక్తిని శ్రేష్టులుగా చెప్పాలి అని బుద్ధుడు అంటారు.మనిషికి శీలమే ప్రధానం..శీలం గల వారే శ్రేష్టులు అని బుద్ధుడు అన్నారు.అంతట తథాగతుడు ఓ అశ్వలాయనా ! నీ ఉద్ధేశం ప్రకారం కులం గొప్పది.నీ ఉద్ధేశం ప్రకారమే ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు అనుకుందాం..ఒక బ్రాహ్మణుడు చదువుకున్నాడు.మరొక బ్రాహ్మణుడు చదువుకోలేదు.మరి వీళ్ళద్దరిలో నువ్వు ఎవరికి గౌరవాన్ని ఇస్తావు? అని అశ్వలాయనుణ్ణి ప్రశ్నించారు బుద్ధుడు.అప్పుడు ఆశ్వలాయనుడు చదువుకున్న బ్రాహ్మణుడినే నేను గౌరవిస్తానని సమాధానం ఇచ్చాడు.మంచిది.అంటూ భగవానుడు మళ్ళీ మరొక ఉదాహరణ చెప్పెను.చదువుకున్న ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు. వారిలో ఒకరికి ఉపనయనం జరిగింది. మరొక బ్రాహ్మణుడికి ఉపనయనం జరుగలేదు. ఇద్దరిలో ఇప్పుడు ఎవరిని నువ్వు గౌరవిస్తావు అని బుద్ధుడు అశ్వలాయనుడిని అడిగారు.అశ్వలాయనుడు నేను ఉపనయనం జరిగిన బ్రాహ్మణుడికే గౌరవాన్ని ఇస్తాను అని అన్నాడు.

భగవాన్ బుద్ధుడు సరే, ఇప్పుడు ఇద్దరు ఉపనయనం జరిగిన బ్రాహ్మణులలో ఒకడు మంచి వాడు.మరొకడు వ్యభిచారి,తాగుబోతూ, తిరుగుబోతూ,అబద్ధాలు ఆడేవాడు, దొంగబుద్ధి గలవాడు, దోపిడీదారుడు.ఇప్పుడు వీళ్ళద్దరిలో ఎవరిని గౌరవిస్తావు అని అడిగెను.అప్పుడు అశ్వలాయనుడు నేను ఎలాంటి చెడు అలవాట్లు లేని మంచివాడైన బ్రాహ్మణుడినే గౌరవిస్తాను అని సమాధానం ఇచ్చాడు.

అశ్వలాయనా ! చూశావా నీవు ఎలా సమాధానం చెప్పావో…అంటూ భగవాన్ బుద్ధుడు ఈ విధంగా పలికెను ‘మొదట నువ్వు పుట్టుకను బట్టి బ్రాహ్మణులను గౌరవించాలని అన్నావు.ఆ తర్వాత చదువుకున్న బ్రాహ్మణుడే గౌరవనీయుడు అని అన్నావు. ఆ తర్వాత ఉపనయనం వంటి సంస్కారాలు పొందిన బ్రాహ్మణుడే గౌరవనీయుడు అని అన్నావు.కట్టకడకు లేదు.. లేదు.. శీలవంతుడైన బ్రాహ్మణుడు గొప్పవాడు అని తేల్చి చెప్పావు. అశ్వలాయనా నీవు కూడా ఒక మనిషి పుట్టుక, చదువు, సంస్కారం,పాండిత్యం… వీటన్నింటికంటే శీలమే ప్రధానం అని ఒప్పుకున్నావు అని అన్నారు.అవును ,భగవాన్ మీరు చెప్పినట్లు ఒక మనిషిని అంచనా వేయడానికి శీలమే ప్రమాణం..అని అశ్వలాయనుడు బుద్ధునికి నమస్సులు తెలియచేసెను.

✍️అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది

You may also like...

Translate »