కుక్క కరిస్తే …

కుక్క అన్నాక కరుస్తుంది, అది ముద్దు పెట్టుకుంటుంది, మూతి నాకుతుంది అని మాత్రమే అనుకుంటే అది మీ మూర్ఖత్వం.

అది ఊర కుక్కైనా, పెంపుడు కుక్కైనా, జాతి కుక్కైనా, వాక్సిన్లు వేసిన కుక్కైనా ప్రతి కుక్క కాటుకి తప్పకుండా రేబీస్ రాకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోకుండా నువ్వు తీసుకునే రిస్కు విలువ నీ ప్రాణం కావచ్చు.

రేబీస్ సోకిన కుక్క మెదడులో రేబీస్ వైరస్ ఉంటుంది. అక్కడ్నుంచి దాని లాలాజల గ్రంధులకు (సలైవరీ గ్లాండ్స్)పాకి దాని ఉమ్మిలోఆ వైరస్ డాన్సు చేస్తూ ఉంటుంది. రేబీస్ సోకిన కుక్కకి మతి భ్రమిస్తుంది, దాంతో అది విచక్షణారహితంగా కనపడినవాళ్లందర్నీ కరుస్తుంది.

ఎక్కడ, ఎంత కరిచింది అన్నది ముఖ్యం. మన మెదడు నుంచి గాయం ఎంత దూరం ఉంది, ఎంత లోపలికి ఉంది అన్నది రేబీస్ మనకి వచ్చే వేగాన్ని డిసైడ్ చేస్తాయి. ఉదా, ముఖం మీద కరిస్తే, కాలు మీద కరిచిన దానికంటే వైరస్ త్వరగా మెదడుని చేరుకుంటుంది. అలాగే చర్మం పైన పన్నుతో గీకడం లేదా తెగిన చర్మం మీద కుక్క నాకడం కంటే పన్ను లోపలికి దిగినట్లు కరిస్తే మెదడుని చేరే వేగం ఎక్కువ. మన ఒంట్లో నాడులు ( నర్వ్స్) అన్నీ మెదడుకి వెళ్తాయి. ఈ వైరస్ కరిచిన చోటుని ఉన్న నాడిని పట్టుకుని పైకెళ్ళి మెదడుని చేరుకుంటుంది. అక్కడ మెదడుని తిని వృద్ధి చెందుతుంది. అదీ విషయం.

ఇక పోతే మనకేదో దెబ్బ తగిలి దాన్ని కుక్క నాకినా, లేదా కుక్క కరిచినా అది రేబీస్ సోకే అవకాశం ఉన్న గాయంగా పరిగణించాలి. కుక్కే కాదు పిల్లి, ఎలుక కరిచినా ఇదే జాగ్రత్తలు తీసుకోవాలి. వాటివలన కూడా రేబీస్ వస్తుంది.

కుక్క కాళ్ళతో గోకితే ఈ ఇబ్బంది లేదు. అలాగే కుక్క తిన్న ఆహారాన్ని తిన్నా కూడా ఇబ్బంది లేదు. (ఇలా తినేవాళ్ళు ఉన్నారు). రేబీస్ ఈ రకంగా రాదు.

మొత్తానికి ఇక గాయాన్ని ముందు సబ్బుతో బాగా కడగాలి. సబ్బులోని క్షారగుణం వలన వైరస్ నిర్వీర్యం అవుతుంది. ఈ కడగటం నీరు ధారగా కారే కుళాయి కింద కడగాలి అంటే వాడిన నీరు మళ్లీ వాడకూడదు. గాయానికి కట్టు కట్టొచ్చు కానీ కుట్లు వెయ్యకూడదు. కుట్లు వెయ్యటం వలన రేబీస్ వైరస్ని సరాసరి సూదితో నాడిలోకి ఎక్కించే అవకాశం ఉంది. కుట్లు వెయ్యాలా వద్దా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు.

కుక్క కరిచిన రోజే ఆంటీ రేబీస్ వాక్సిన్ వేయించుకోవాలి. అక్కడ్నుంచి మిగతా మూడు డోసులూ క్రమం తప్పకుండా సమయానికి వేసుకోవాలి. ఈ వాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తుంది. కొన్నిసార్లు కరిచింది రేబీస్ ఉన్న కుక్కే అని నిర్ధారణ అయినపుడు, గాయం పెద్దది ఉన్నప్పుడు అక్కడ చేరిన వైరస్ ని నిలువరించడానికి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ చేస్తారు. ఇది అన్నివేళలా అవసరం లేదు, అలాగే అందుబాటులో ఉండదు.

ఏదైనా గాని వైరస్ మెదడుకి చేరనంత వరకే, ఒకసారి చేరాక రేబీస్ వస్తుంది. దీనికి వైద్యం లేదు. మరణం తథ్యం. కాబట్టి కుక్కలకి దూరంగా ఉండండి. కుక్కలున్న ఇళ్లకి దూరంగా ఉండండి. ఎక్కువ పెంపుడు కుక్కలకు తర్ఫీదు ఇవ్వరు కాబట్టి అవి కరుస్తాయి. వాటి జోలికి వెళ్ళకండి. మీ పిల్లలని ఒంటరిగా రోడ్డుపైకి పంపకండి

You may also like...

Translate »