మనిషికి మతం లేనిది జీవించలేడా?


జీవించగలడు. స్వేచ్ఛ.సమానత్వములతో
మంచి మనిషిలా బతకగలడు. మనిషికి కూడు, గుడ్డ నివాసం లాంటి ప్రాథమిక అవసరాలు తప్ప మతం అవసరం లేదు.మనం ఉన్న ఈ భూగ్రహంపై అనేక కోట్ల జీవరాసులు బతుకుతున్నాయి. అవి తమ సహజత్వంతో వాటికి అనుకూలమైన రీతిలో జీవనం సాగిస్తున్నాయి.ప్రకృతి కి అనుకూలంగా లేని జీవరాసులు అంతరించిపోయాయి. ప్రకృతి నియమాలను ప్రకోపాన్ని తట్టుకొని నిలబడినవి మాత్రమే మనం చూస్తున్న జీవరాసులు.

ఈ భూగ్రహంపై ఉన్న మనిషికి తప్పఏ జీవులకూ మతం లేదు. దేవుడు లేడు. స్వర్గ నరకాలు అంటే వాటికి తెలియదు. తినడం, తిరగడం, పడుకోవడం, మైధునం అంతే వాటి పని.
అవి ఎంతో సంతోషంతో వాటి సహజత్వంతో జీవిస్తున్నాయి.

ఏం దరిద్రమో కానీ? మనిషికి ఎన్ని ఉన్నా!
ఏది సాధించినా! కలలోనైనా ఊహించని వస్తు సముదాయాన్ని, అద్భుతాలను సృష్టించినా! మానసిక ప్రశాంతత మాత్రం లేదు.

అన్ని జీవరాసులలోకెల్లా మనిషి కి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వాటి ద్వారా తాను అన్నింటికన్నా అధికుడనని భావిస్తున్నాడు.
ప్రాచీన మానవుడు జీవించడానికి కొన్ని అప్పటి వాతావరణానికి తనకు సరియైన వాటిని ఎన్నుకొని తనకు తోచిన ఇష్టమైన, నియమాలను
పాటించి ప్రకృతికి అనుకూలంగా జీవించసాగాడు.

ఆనాడు మానవుడు ఆచరించిన నియమాలు యధాతధంగా వారి తర్వాత వంశపారంపర్యంగా ఆచరిస్తూ వచ్చారు. కాలక్రమాన గణరాజ్యాలన్నీ, స్వతంత్ర రాజ్యాలుగా మారి రాజులు పరిపాలించారు. వారి పాలనలో మరికొన్ని నియమాలు సమాజంలో చొరబడ్డాయి.
అవి అప్పటికి అవసరమైనవి మాత్రమే.
అట్టి నియమాలు పాటిస్తూ వచ్చారు.
అవి సంప్రదాయాలుగా స్థిరపడి, అవే నేటి మతాలు గా రూపొందాయి. మతం అంటే గడ్డ కట్టిన,
మార్పు లేని నియమం.మనుషులను విడదీసే ఒక దుర్మార్గపు విధానం.

ప్రపంచవ్యాప్తంగా భిన్న ప్రాంతాలలో, భిన్న నియమాలతో, భిన్న మతాలు ఆవిర్భవించాయి.
మన దేశంలో సుమారు నాలుగు నుండి,ఐదు వేల సంవత్సరాల క్రింద ఆవిర్భవించిన మతం ఇప్పటివరకు అవే నియమాలతో కొనసాగుతూ ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. గడిచిన కొలది మన దేశంపై దండెత్తిన కొన్ని మత రాజ్యాలు హస్తగతం చేసుకొని వారి మతాలను కూడా మన దేశంలో ప్రచారం గావించారు. క్రిస్టియన్, ముస్లిం అదేవిధంగా మన దేశంలో ఉనికిలోకి వచ్చాయి.

మనదేశంలోనే పురుడు పోసుకున్న బౌద్ధ, జైన ధర్మాలు మన దేశంలోనే ఎక్కువ కాలం నిలువలేక ఇతర దేశాలకు వ్యాపించాయి. మనదేశంలో పుట్టిన ఒక మతం వాటిని తనలో కలుపుకోలేకపోయింది. దాని ధాటికి నిలువలేక బౌద్ధం విదేశాలకు తరలి వెళ్ళింది. జైనం అరకొరగా మిగిలిపోయింది. సనాతనం పేరుతో, సదాచారాల పేరుతో, సంప్రదాయాల పేరిట మన దేశ ప్రజలలో మతం జీర్ణించుకుపోయింది

చరిత్రను తవ్వి చూస్తే మతాల వల్ల జరిగిన మంచి ఇసుమంతైనా కనరాదు. వాటి వల్ల ప్రజల మధ్య బేధాలు, పగ, ద్వేషం,ప్రతీకారాలు పెరిగినవే తప్ప, ఒరిగిందేమీ లేదు. మతాల వల్ల మనుషులు విడదీయబడ్డారు. మతానికి తోడు కులాలు
జతగూడి, ప్రతి మనిషి మధ్య అడ్డుగోడలుగా స్థిరపడిపోయాయి.

ప్రపంచవ్యాప్తంగా రోగాల వల్ల చనిపోయిన వారి కంటే మత యుద్ధాల వల్లనే ఎక్కువగా జన హననం జరిగింది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. వేల ఏళ్ల నాటి నుండి మతాలలో మార్పు లేదు.

కానీ సమాజంలో మార్పు వచ్చింది. ఆధునికత సంతరించుకున్నది. కాలంతో పాటు మతంలో మార్పులు జరగలేదు.పురాణాలు మత గ్రంథాలు మనుషులకు ప్రాధాన్యతనివ్వలేదు.

మత గ్రంథాలలోని పాత్రలు “దేవుళ్ళ'”ని మనుషుల మీద రుద్దడం జరిగింది.కొందరు స్వార్ధపరులు తాము సోమరిపోతుల్లాగా కూర్చుండి బతకడానికి
దేవుళ్ళ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు.
రాళ్ళల్లో దేవుళ్ళు ఉన్నారని రాళ్లను నిలబెట్టి వాటికి పూజలు జరిపించాలని, స్నానాలు, చేయించాలని,పట్టుబట్టలు తొడగాలని, కిరీటాలు సమకూర్చాలని, ఆభరణాలు వేయాలని, పెళ్లిళ్లు జరపాలని అవే మనల్ని రక్షిస్తున్నాయని,
అవే మన జన్మ కారకులని రాళ్లను పూజిస్తే, పుణ్యం లభిస్తుందని,సరాసరి స్వర్గానికి వెళతారని మాయమాటలతో ఇంత ఆధునిక కాలంలోనూ,ఇప్పటికీ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారు. వారి మాయ మాటలు నిజం అనుకొని ప్రజలు, తోటి మనుషులను హీనంగా చూస్తూ ప్రాణం లేని కదలిక లేని రాళ్లను పూజిస్తూ,
రాళ్లను దేవుళ్ళుగా భ్రమించి జీవితంలో ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతున్నారు.

తోటి మనిషిని పట్టించుకోక మూర్ఖత్వంతో, మూఢత్వంతో పశుపక్ష్యాదుల కన్నా హీనంగా జీవనం గడుపుతున్నారు. తాము గొప్పగా జీవిస్తున్నామని, సంప్రదాయ బద్ధంగా ప్రవర్తిస్తున్నామని, పిచ్చి భ్రమలో ఉన్నారు.
వారే కాకుండా వారి పిల్లలను కూడా అలాగే తయారు చేస్తున్నారు. అందుకే తరతరాలుగా “మతం” అనే మూఢత్వం మనుషుల్ని పట్టి పీడిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది మతం అవసరం లేదని, మత గ్రంథాలు అబద్ధమని, స్వతంత్రంగా స్వేచ్ఛగా సమానత్వంతో జీవిస్తున్నారు. దేవుడు నమ్మని వారికి ఎలాంటి కీడు జరగడం లేదు. హిందువులు, క్రిస్టియన్ మతాన్ని మతవాదులను నమ్మరు.
అలాగే క్రిస్టియన్స్ ఇతర మతస్తులను నమ్మరు. ముస్లింలు ఇతర మతాలను మతవాదులను నమ్మరు. దేవుళ్లను నమ్మరు.
అంతమాత్రాన వారు జీవించడం లేదా?
మనిషి తప్ప ఇతర ఏ జీవజాలానికి కూడా దేవుళ్ళు లేరు.మనిషి జీవించడానికి ఏ మతం అవసరం లేదు.ఏ మతము మనుషులను రక్షించదు. ఏ దేవుడు లేడు. మనుషులను రక్షింపడు.
మనిషే, మనుషులకు సహాయపడతాడు.
మనిషే మనిషి యందు దయ, జాలి, సానుభూతి, సహాయ ,సహకారాలు అందజేస్తాడు.
కాబట్టి మతం ఆచరించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. మనిషి మతం ఆచరించడం వలన నష్టమే కానీ, ఎలాంటి లాభం లేదు.

“మతాన్ని విడనాడండి.
మనిషిలా బతకండి”

You may also like...

Translate »