తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఏకైక నినాదంతో కలిసిన ప్రజలు రాష్ట్రం వచ్చాక వెనకటి లెక్క తిరిగి పోయారు. ఎవరి కుంపటి వారిదైంది. బీసీ ఉద్యమం ముందుకు వేస్తే ఇట్లనైనా అందరు కలుస్తారు పోతుంటే అవి పది సంగాలలఉద్యమాలుగా చీలిపోయాయి. మహిళాలోకం కలిసి ఉద్యమిస్తారనుకుంటే అవీ అంతే. రచయితలు కళాకారులు జర్నలిస్టులు మేధావులు విద్యావంతులు కలిసి అందరిని ఒక్కటి చేస్తారనుకుంటే వీరే ముందుగా విడిపోయి ఇతరులకు మార్గం వేసినట్టుంది. పరస్పరం కలిసి పని చేసి బలం బలగం పెంచుకునే బదులు పరస్పరం కలహించుకుంటూ విమర్శించుకుంటున్నారు. అల్ప లక్ష్యాలు కెరీరిజం అసూయ ఓర్వలేని తనం అహం సెల్ఫీల వలె సెల్ఫిష్ నెస్ పెరుగుతున్నది. పరమత విద్వేషం , ప్రాంతీయ విద్వేషం వర్ణ వివక్ష కులవివక్ష అంతచ్చేతనలో స్థిరపడి మనిషిని మానవతను విధ్వంసం చేస్తున్నది. మతసామరస్యం తిరిగి నెలకొంటే తప్ప ఈ చీలికలు కలవవు. మోహన్ భగవత్ గారూ! కులాల మధ్య ఘర్షణ వివక్ష మత ద్వేషం అన్నిటికీ ఒకటే కుదురు. సమస్త ద్వేషాలను పరిష్కరించే బౌద్దంను రామజన్మ భూమి వలె ఒక 50 ఏళ్లు ప్రచారం చేయాలని పిలుపు ఇవ్వండి. “మనుధర్మం వర్ణ కుల వివక్ష లేని”హిందుత్వం బౌద్దం మధ్య సఖ్యతతో నిజమైన విశ్వగురు స్థానం లభిస్తుంది.