డీఎస్సీ-2008 అభ్యర్థులకు వారంలో కొలువులు

డీఎస్సీ-2008 అభ్యర్థులకు వారంలో కొలువులు
హైదరాబాద్: డీఎస్సీ-2008లో నష్టపోయిన 1399 మంది అభ్యర్థులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. వారి ధ్రువపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. వారంలో వారికి నియామకపత్రాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. డీఎస్సీ-2024లో క్రీడాకోటా ఉపాధ్యాయ నియామకాలకు ధ్రువపత్రాల పరిశీలన ముగిసిందని, త్వరలో నియామకపత్రాలు ఇస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజనం కలుషితంపై ఆయన మాట్లాడుతూ బియ్యం నిల్వ, వండేటప్పుడు పాటించాల్సిన శుభ్రత తదితర అంశాలపై ప్రామాణిక అమలు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. కొత్త బియ్యం కావడం వల్ల అన్నం ఉడకడంలో కొంత తేడా ఉందని, దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు.
