పారిశుద్ధ కార్మికుల బతుకులు మారేదెన్నడు..

Oplus_131072


— నెలల తరబడి వేతనాలు కరువు.
— కనీస ఆదరణకు నోచుకోని పారిశుధ్య కార్మికులు.
–ఒక్కరోజు పనిలో రాకుంటే ఈసడింపులే, అవమానాలు ..
ఫోటో.
జ్ఞాన తెలంగాణ – బోధన్
కోడి కూయకముందే, జనం మేల్కోనకముందే విధి నిర్వహణలో నిమగ్నమవుతారు పారిశుద్ధ కార్మికులు. గ్రామంలో ఎక్కడ చెత్తాచెదారమున్న వేకువ జామనే వారు జనం లేవకముందే రోడ్లను అద్దంలో కనిపించేలా శుభ్రపరుస్తారు పారిశుద్ధ కార్మికులు. అంతేకాదు కాలనీలలో మురికి కాలువలను శుభ్రం చేసి ఎలాంటి దుర్వాసన రాకుండా వారి బతుకులను దుర్భరం చేసుకుంటూ జనాలకు సేవలందిస్తారు పారిశుధ్య కార్మికులు. అంతటి నిబద్ధతతో పని చేసే కార్మికులకు నేడు జీవించడానికి జీతాలు కరువై అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో పారిశుధ్య కార్మికులకు సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు గడవని పరిస్థితుల్లో అల్లాడుతున్నారు. పారిశుధ్య కార్మికులు ఒళ్లంతా హూనం చేసుకొని చాలిచాలని వేతనంతో మురికి కూపంలో దిగి మురికి కాలువల శుభ్రం చేస్తున్న ,వారిని పట్టించుకునే నాథుడే లేడు. అనారోగ్యంతో ఏ ఒక్కరోజు విధులకు గైరాజరైన పంచాయతీ అధికారులు, నాయకుల ద్వారా ఈసడింపులు, చీదరింపులు, అవమానాలే దిక్కువుతాయి. అంతేకానీ అనారోగ్యంతో ఉన్నారేమోనన్నా కనీస కనికరం ఉండదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గల 530 గ్రామపంచాయతీలలో పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. 500 మంది జనాభాకు ఒకరి చొప్పున మల్టీపర్పస్ విధానంలో కార్మికుల నియామకం చేపట్టారు .దాంతో చిన్న గ్రామ పంచాయితీలలో ముగ్గురు, నలుగురు ఉంటే మేజర్ గ్రామ పంచాయితీలలో పదిమంది వరకు పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ వారికి గ్రామపంచాయతీ పాలకులు నెలనెలా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోటగిరి మండలం హంగర్గా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు గత 6, 8 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నీలా గ్రామపంచాయతీ ,రెంజల్ గ్రామపంచాయతీలో గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు కుటుంబాలు గడవక మదన పడుతున్నారు. బోధన్ మండలంలో నెల, రెండు నెలలపాటు పలుచోట్ల వేతనాలు అందడం లేదని కార్మికుల పేర్కొంటున్నారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సాలుర మండలంలో సరిపడా పారిశుధ్య సిబ్బంది లేక గ్రామంలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి .అనారోగ్య మూలంగా పలువురు కార్మికులు అప్పుడప్పుడు గైర్హాజర్ కావడంతో కాలనీలు శుభ్రం చేయక మరింత దుర్భరంగా మారుతున్నాయి.
పారిశుద్ధ్య కార్మికులకు అందని వస్తువులు..
గ్రామపంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నెలనెలా నూనెలు, సబ్బులు అలాగే గ్లౌజులు , చెప్పులు అందించవలసి ఉంటుంది. కానీ అవి కూడా సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పాశుద్ధ కార్మికులు మురుగుతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అసలే నిరుపేద కుటుంబాలు కావడంతో వేతనం సరిగా రాకపోవడంతో జ్వరాలతోనే విధులకు హాజరై పనులు చేయవలసిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో పారిశుధ్య కార్మికులకు గతంలో 8500/- చొప్పున వేతనాలు చెల్లించింది. మధ్యలో మరో వెయ్యి రూపాయలు పెంచడంతో ప్రస్తుతం 9500/- వేతనం అందిస్తున్నారు. ఈ వేతనం కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం పిల్లల చదువులకు, రోజువారి కుటుంబ నిర్వహణకు డబ్బులు లేక అప్పులు చేయవలసిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. మల్టీ పర్పస్ విధానంలో నియమించిన పారిశుధ్య కార్మికులు వీధిలైట్లు వేయడం ,పారిశుధ్యం పనులు, మురుగు కాలువలు పూడిక తొలగింపు, చెత్త ట్రాక్టర్ నడపడం, మంచినీటి సరఫరా పనులు చేయవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఏ ఉద్యోగి రాకున్నా వీరు మాత్రం గ్రామాలలో పారిశుద్ధ్య పనులకు హాజరుకాకుంటే ఆరోజు గ్రామం మురికితో, చెత్తాచెదరంతో దుర్ఘందంగా మారుతుంది. కాలనీలలో చెత్త సేకరణకు ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు వెళ్తారు. ఏ ఒక్కరోజు వెళ్లకున్న ఇండ్లలో చెత్త మురుగుతుంది. ఇంతటి కష్టమైన పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు అందకపోవడం శోచనీయమని కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కావున ప్రభుత్వం తక్షణమే వీరి బకాయి వేతనాలను మంజూరు చేసి ఆదుకోవాలని కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
8 నెలలుగా జీతం లేదు..
హనుమాండ్లు, హంగర్గ ఫారం.
తాను హాంగర్గ జీపీలో విధులు నిర్వహిస్తాను.తనకు ఇప్పటివరకు గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వేతనం రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. జీతాలు అడిగితే గ్రామ పంచాయతీలో నిధులు లేవని నిధులు రాగానే జీతాలు ఇస్తామని గ్రామ పంచాయతీ పెద్దలు అంటున్నారు. దాంతో ఏం చేయాలో తెలవక అలాగే పనులు చేస్తున్నాం. జీతాలు ఎప్పుడు వస్తాయోనని ఆశతో ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో పిల్లలకు, రోజువారి కుటుంబ నిర్వాహనకు అప్పులు చేయవలసి వస్తుంది.
*మూడు నెలలుగా జీతాలు లేవు..ఏం తిని బతకాలా?…
లలిత, నీల జీపీ.
జీతాలు రాకున్నా మూడు నెలల నుండి అలాగే నెట్టుకొస్తున్నాం. పైసలు అవసరమైనప్పుడల్లా బయట చేబదులు తీసుకొని, కొన్నిసార్లు వడ్డీకి అప్పులు తీసుకొని కుటుంబాలను నడుపుతున్నాం. ఈ గవర్నమెంట్ గ్రామపంచాయతీలకు డబ్బులు ఇవ్వలేదని మాకు జీతాలు ఇయ్యక సతాయిస్తున్నారు. కావున అధికారులు తక్షణమే స్పందించి మాకు జీతం ఇవ్వాలి.జీతాలు ఇయ్యకుంటే మేం ఏంతిని బతకాలా సార్లు.

You may also like...

Translate »