ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు నిర్మించాలి:జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు నిర్మించాలి:జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రధానోపాధ్యాలకు మన పాఠశాలను బాగు చేసుకుంటున్నామన్న ఓనర్ షిప్ ఉండాలి.
జూన్ 10వ తేది వరకు అన్ని పనులు పూర్తి చేయాలి.
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:
ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాలలలో కొనసాగుతున్న పనుల పురోగతిపై విద్యా, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయితి రాజ్, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, ఏపీఎంలలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు ఖచ్చితంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, కిటికీలు, తలుపుల మరమ్మత్తులు చేయించడం జరుగుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 420 పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టడం జరుగుతుందని వాటి కోసం ఇప్పటి వరకు సుమారు 14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
జూన్ 12 న పాఠశాలలు పునఃప్రారంభం సమయానికి చేపట్టిన అన్ని మరమ్మత్తు పనులను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు.
కొన్ని పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా బాగు చేయడం జరిగిందని, మన ఊరు మన బడి పథకం ద్వారా ఇంకా అక్కడక్కడ పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు అంచనాలు అందించాలని వెంటనే వాటికి సంబందించిన నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలనీ పేర్కొన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని పాఠశాలలో చదివే విద్యార్థులను బట్టి అవసరమైనన్ని మరుగు దొడ్లు నిర్మాణానికి ప్రతి పాదనలు అందిస్తే ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా వాటిని పూర్తి చేయిస్తామని తెలిపారు.
పాఠశాలలో మౌలిక వసతులు బాగైనట్లైతే విద్యార్థుల హాజరు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
ప్రతి పాఠశాలలో పనులు పూర్తి అయిన తరువాత వైట్ వాష్ వేసి అందనగా తయారు చేయాలని అన్నారు. పాఠశాలలలో మరమ్మత్తులు చేసే ముందు ఒక ఫోటో, పనులు జరుగుతున్నపుడు, పనులు పూర్తయిన తర్వాత మరొక ఫోటో ను తీసి భద్రపరచాలని తెలిపారు.
ప్రతి పాఠశాలలో మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఏర్పాటు కొరకు మూడు రోజులలో ప్రతిపాదనలు అందించాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరిగిన పనులకు నిధులు చెల్లింపు వివరాలను లెక్క పక్కాగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదులో చేయాలని అన్నారు. ప్రతి రోజు జరుగుతున్న పనుల వివరాలు, మెటీరియల్ ఖర్చులు, లేబర్, ఇతరత్రా ఖర్చులు రిజిస్టర్ లో నమోదు చేయాలని,
అంతే కాకుండా పనులు పూర్తి అయిన తరువాత లేబర్ ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు చెక్కు ద్వారా అందించాలని అన్నారు. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాలల పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పనులుకు కమిటీ సభ్యులు తీర్మానం చేసి సంతకాలు తీసుకోవాలి అని సూచించారు. ఎంపీడీవో లు క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేయాలని మరుగు దొడ్లులేని పాఠశాలాల్లో నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో ఉన్న కేజీవిబి, మోడల్ స్కూల్ లలో కావలసిన మౌలిక వసతుల కల్పన కోసం పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనాలు తయారు చేసి అందిస్తే నిధులు మంజూరు చేస్తామని కలెక్టరు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తాము పాఠశాలల కు వెళ్తే మంచిగా చదువుకోడానికి ఏ విదమైన సౌకర్యాలు ఉంటే బావుంటాయో అన్న ఆలోచనతో పాఠశాలలు బాగు చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఈఓ రామ్ కుమార్, డి ఆర్ డి ఓ నరేష్, డిపిఓ నారాయణరావు, ఆర్ డబ్ల్యూ ఎస్ నిర్మల, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపిఓలు తదితరులు పాల్గొన్నారు.