నేడు మాన్యవర్ కాన్షీరామ్ 18 వ వర్థంతి

నేడు మాన్యవర్ కాన్షీరామ్ 18 వ, వర్థంతి

అరియ నాగసేన బోధి(వ్యాసకర్త)

ప్రయాణించడానికి ఒక సైకిల్, దారి ఖర్చుల కోసం చేతిలో ఒక హుండీ, తను ప్రసంగించిన చోట బహుజనులు హుండీలో వేసిన డబ్బుతో ఉత్తర ప్రదేశ్ అంతటా తిరిగి బహుజన రాజ్యం తీసుకొచ్చాడు మాన్యశ్రీ కాన్షిరామ్ గారు.

భారతదేశంలో అసమాన హిందూ కులవ్యవస్థ వలన మానవహక్కులను కోల్పోతున్న పీడితులైన ఎస్సీ, ఎస్టీ, ఒబిసి,మైనారిటీ ప్రజలైన బహుజనుల కోసం,అణచివేతకు గురవుతున్న మహిళలు కోసం, పోరాటం చేసిన బహుజన ఫోర్ ఫాదర్లు గౌతమ బుద్ధ, సంత్ కబీర్, మహాత్మా జోతిబా ఫూలే-సావిత్రి బాయి ఫూలే,ఛత్రపతి సాహూ మహారాజ్,నారాయణ గురు,బిర్సాముండా,పెరియార్, కొమరం భీమ్, డా.బి.ఆర్.అంబేడ్కర్-రమాబాయి అంబేడ్కర్ లు.బహుజన మహనీయులందరినీ తనకు మన సమాజానికి ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యాధికారం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన మాన్యవర్ కాన్షీరామ్ గురించి బహుజనులు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.సాహెబ్ కాన్షీరామ్ పనివిధానంలో కాకుండా ఎవరైనా మేం బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తోన్నాం అంటున్నారు అంటే అవి నీటిపై వ్రాసిన మాటలనే అనుకోవాలి. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తర్వాత బహుజనుల కోసం మనువాదులతో పోరాటం సాగించిన గొప్ప యోధుడు మాన్యవర్ కాన్షీరామ్. అంబేడ్కర్ ఉద్యమ మిషన్ ను ,రథాన్ని దాదాసాహెబ్ కాన్షీరామ్ కొనసాగించారు.అవకాశవాద,వ్యక్తిగత స్వలాభం కోసం ఆయన రాజకీయాలు నడపలేదు.భారత రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ను నిర్మించి బహుజనులకు ఒక పార్టీ ను అందించిన బహుజనుల ఆశాజ్యోతి ఆయన.సాహెబ్ కాన్షీరామ్ రాజకీయ చతురుడు,రాజనీతి తెలిసిన వారు,బహుజన సిద్ధాంత కర్త.* *కమ్యూనిజం సిద్ధాంత కర్తలు కార్ల్ మార్క్స్-ఫ్రెడరిక్ ఏంగెల్స్ లు.ఈ సిద్ధాంతాలను ఆచరణలో సాధ్యం చేసిన వారు వి.ఐ.లెనిన్, స్టాలిన్, మావో జెడాంగ్,హోచిమిన్,ఫైడల్ కాస్ట్రోలు.అంబేడ్కర్ రాజకీయ సిద్ధాంతాలను అంబేడ్కర్ సిద్ధాంతాలను మాన్యవర్ కాన్షీరామ్ సాధించగలిగారు.ఒక బౌద్ధ భిక్ఖు వలె కాన్షీరామ్ బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేశారు.

తథాగత బుద్ధుని వలె స్వంత ఆస్థులను వదులుకుని,జత బట్టలతో ,బ్రహ్మచారిగా 45 సంవత్సరాల పాటు దేశమంతటా సైకిల్ పై తిరిగి బహుజనుల పక్షాన నిలబడి,బహుజనుల బాధలను,అవస్థలను తెలుసుకుని ,బహుజనులకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీను అందించిన పీడితజన నాయకుడు కాన్షీరామ్.

డా.అంబేడ్కర్ 1942 లో స్థాపించిన “ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ” ఎన్నికల గుర్తు ఏనుగు.బుద్ధుని విజ్ఞతకు,జ్ఞానానికి గుర్తు నీలి రంగు.ఈ రెండింటిని తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ను కాన్షీరామ్ స్థాపించారు.నేడు జాతీయ స్థాయిలో ఈ పార్టీ మూడవ స్థానంలో ఉంది.ఓట్లను డబ్బులు పెట్టి కొనకుండా,ఓటుకు ఒక నోటు తీసుకుని బ్యాలెట్ యొక్క శక్తిని నిరూపించిన సోషల్ ఇంజనీర్ కాన్షీరామ్. బ్రాహ్మణ వాదానికి మాత్రమే మేం వ్యతిరేకం-బ్రాహ్మణులకు మేం వ్యతిరేకం కాదని చెప్పిన కాన్షీరామ్ కులరహిత సమాజం కోసం కులాన్ని ఉపయోగించుకుంటానని కూడా చెప్పారు. అసాధ్యాలను సుసాధ్యం చేయగల సమర్థుడు కాన్షీరామ్.

సాహెబ్ కాన్షీరామ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెబుతూ తెలుగు దేశం గెలిస్తే కమ్మలు రామారావును,కాంగ్రెస్ గెలిస్తే రెడ్లు రెడ్డి ను ముఖ్యమంత్రిగా చేస్తారనీ,ఎస్సీలు మాత్రం ఇంకా రిజర్వేషన్లు కై పోరాడే దశలోనే ఉన్నారని చెప్పారు. కాపులు, ఎస్సీ ల కలిస్తే రాజ్యాధికారం సాధ్యమని,1994 లో కాపులకు అత్యధిక సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారా కాపులు-బడుగులు కలిసి పనిచేయాలని కాన్షీరామ్ పిలుపునిచ్చారు.

కాన్షీరామ్ 1934 మార్చి 15వ తేదీన పంజాబ్ లోని రోపార్ జిల్లా, కవాస్ పూర్ గ్రామంలో హరిసింగ్-బిషన్ సింగ్ కౌర్ దంపతులకు జన్మించారు. కాన్షీరామ్ కు ఇద్దరు తమ్ముళ్లు, నలుగురు చెల్లెళ్లు. కాన్షీరామ్ తాత ధోలేరామ్ సైన్యం లో పనిచేసి పదవీ విరమణ తర్వాత కవాస్ పూర్ లో తోళ్ళ పరిశ్రమ స్థాపించారు. కాన్షీరామ్ తండ్రి హరిసింగ్ కు స్వాభిమానం ఎక్కువ.కులమత బేధాలు, ధనిక, పేద తారతమ్యం లేకుండా హరిసింగ్ జీవించారు.హరిసింగ్ పెద్దగా చదువుకోకపోయినా తన ఏడుగురు పిల్లలను చదివించి ప్రయోజకులను చేశారు. కాన్షీరామ్ తండ్రి భావాలను స్పూర్తితో తీసుకున్నారు. కాన్షీరామ్ రామదాసియా సిక్కు కులంలో బిఎస్సీ వరకు చదివిన మొదటి విద్యార్థి.ఈ కులం వాళ్ళు తలపై పాగా ధరించడం ఆచారం.అయితే కాన్షీరామ్ వీటిని పాటించేవారు కాదు.చక్కగా హెయిర్ కటింగ్ చేయించు కునేవారు.చిన్నప్పటి నుండి ఎవరిపైనా ఆధారపడకుండా క్రమశిక్షణ పాటించిన వ్యక్తి కాన్షీరామ్. చదువులో ,ఆటలలో ముందుండేవారు.1956లో డెహ్రడూన్ లో స్టాఫ్ కాలేజీలో ఉన్నత చదువు పూర్తి చేశారు. డెహ్రడూన్ లో ఇండియన్ భూవైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగం సాధించారు.1958 లో పూణే లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్సప్లోసివ్స్ సంస్థ లో పరిశోధనాధికారిగా కాన్షీరామ్ నియమితులు అయ్యారు. రామదాసీ చమార్ కులం నుండి ఒక శాస్తవ్రేత్తగా కాన్షీరామ్ ఎదిగారు.

చెల్లాచెదురుగా ఉన్న సమాజాన్ని ముత్యాల దండగా సూత్ర రూపంలో బహుజనులుగా ముడిపెట్టిన మాన్యవర్ సాహెబ్ కాన్షీరామ్ పరినిర్వాణ దినం సందర్భంగా ఘన నివాళి.”ఈ అసమాన వ్యవస్థ యొక్క బాధితులను ఏకం చేసి, మన దేశంలో అసమానత స్ఫూర్తిని పడగొట్టే వరకు మేము ఆగము. ”- మాన్యశ్రీ కాన్షిరామ్**”నేను బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ఒకే ఒక్క పుస్తకం చదివి పిచ్చొనైపోయి, ఇంటిల్లిపాదిని వదిలి, ఆయన లక్ష్యం పూర్తి చేయడానికి పూనుకున్నాను; నాకు అర్థం కానిదేమిటంటే, బాబాసాహెబ్ గారి అనేక రచనలు చదివి, ఆయన ప్రసంగాలు విన్న వారు కూడా, ఉలుకు పలుకు లేకుండా సచ్చిన శవాల వలే ఎలా ఉండగల్గుతున్నారని?” అని కాన్షీరామ్ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి.ఈ రోజు తన 16 వ పరినిర్వాణం సందర్భంగా కాన్షిరామ్‌కు వందనం.అతను సామాజిక సంస్కర్త మరియు రాజకీయంగా బహుజనులను సమీకరించారు.

You may also like...

Translate »