కలిసి కట్టుగా బడిని బతికించారు

- ఉపాధ్యాయుడి సంకల్పం, గ్రామస్తుల సమిష్టి కృషి ఫలితం..
- ఇద్దరు నుంచి 22 మంది విద్యార్థులతో కళకళ..
కట్టంగూర్, సెప్టెంబర్ :
చాలా సర్కారు బడులు విద్యార్థులు లేక మూతపడ్డాయి. కానీ ఈ బడిలో మాత్రం గ్రామస్తుల సహకారం, ఉపాధ్యాయుడి శ్రద్ధ ఉత్తమ బోధనతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించే కన్నా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుని ఉత్తమ బోధన జరిగేలా సౌకర్యాలు కల్పించుకుందామని గ్రామస్తులు చేయి చేయి కలిపి పాఠశాల అభివృద్ధి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కట్టంగూర్ మండల మల్లారం ప్రాథమిక పాఠశాలలో ఏప్రిల్ 2025లో కేవలం ఒక ఉపాధ్యాయుడు. ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో ద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను ఎలాగైనా బ్రతికించాలనే సంకల్పంతో ఉపాధ్యాయుడు సమ్మెటి తిరుమలేశ్ తో పాటు గ్రామస్తులు నడుంబిగించారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుడు సమిష్టి నిర్ణయంతో చందాలు వేసుకొని ముందుగా పాఠశాలను రంగులతో ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కోసం దాతల సహకారంతో… 25 ఫ్లెక్సీలు, ప్రభుత్వం ద్వారా ఒక బ్లూటూత్ స్పీకర్, కార్పెట్, టేబుల్ ఫ్యాన్, గేమ్స్ మెటీరియల్, లైబ్రరీ బుక్స్, విస్తృతమైన టీఎల్ ఎం సమకూర్చుకున్నారు. విద్యార్థుల పుట్టిన రోజులు, వివిధ జాతీయ వేడుకలను పాఠశాలలో పర్యావరణ హితముగా నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థుల తల్లితండ్రుల కొరిక మేరకు పాఠశాలను సాయంత్రం ఐదు గంటల వరకు నడపడంతో పాటు విద్యార్థుల విద్యా విషయాలను వాట్సప్ లో తల్లితండ్రులకు తెలియజేస్తున్నారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుడి కోరిక మేరకు ఎంఈఓ పాఠశాలకు విద్యార్థులకు అవసరమైన బెంచీల అందజేయడంతో పాటు అదనపు ఉపాధ్యాయుడిని నియమించారు. అందరూ కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. పాఠశాలపై నమ్మకం కలిగించడంతో విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపించారు. ఫలితంగా 2025-26లో విద్యార్థుల సంఖ్య 2 నుంచి 22 చేరింది. మన ఊరి బడి బాధ్యత మనదే అనుకొని.. చేయి చేయి కలిపి ఉపాధ్యాయుడి సహకారంతో కలిసికట్టుగా బడిని బతికించుకున్నారు. దీంతో పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతుంది. జూన్ నుండి నేటి వరకు విద్యార్థులు సాధించిన ప్రగతిని తల్లిదండ్రులకు ప్రదర్శిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు సమ్మెటి తిరుమలేశ్ తెలిపారు.