ఆయన సిలువపై పొందిన హింస – నీ రహస్య పాపాల కొరకే..! నిన్ను నిత్యజీవానికి నడిపించుట కొరకే..!



ఆయన ఏ పాపమూ చేయలేదు… ఏ నేరమూ చేయలేదు… అయినా ఆయన శిక్షకు లోనయ్యాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలకు శిక్ష అనివార్యం. ఆ శిక్షను మనం అనుభవిస్తే విమోచనం లేదు. అటువంటి సందర్భంలో, మన స్థానంలో ఆ శిక్షను భరించినవాడు ఒక్కరే – ప్రభు వైన ఏసుక్రీస్తు, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకు విమోచన, శాంతి, నూతన జీవం దక్కింది.

కల్వరి కొండ వైపు నడిచి వెళ్ళే ఆయన పయనమొక బలహీనుడి అడుగులు కావు. అది ఓ ధైర్యవంతుడి ప్రేమయాత్ర. భుజాన మోసిన సిలువ, ఆయన చేతుల్లో నాటిన శిలలు, ముళ్ళ కిరీటం, కొరడాల దెబ్బలతో నిండిన శరీరం… ఇవన్నీ చూస్తుంటే మన హృదయం విరిగి పోవాల్సిందే. ఆయన ప్రతి గాయం మన పాపానికి మూల్యంగా నిలిచింది. ముఖంపై ఉమ్మివేశారు, పిడుగుద్దులు గుద్దారు, ముఖంపై వెంట్రుకలు పెరికారు. అయినా ఆయన మౌనంగా భరించాడు. చివరికి, “తండ్రీ…! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు,… దయతో వీరిని క్షమించుము” అనే మాటలు చెప్పిన ఆయన ప్రేమను భూమి మర్చిపోలేదు.

సిలువపై మరణించే సమయంలో కూడా ఆయన మన గురించి ఆలోచించాడని గుర్తు చేసుకోవాలి. “మీ కొరకు ఏడవండి… మీ బిడ్డల కొరకు ఏడవండి…” అని అన్నాడు. ఆ భావం వెనుక ఉన్న ప్రేమ, బాధను మానవ మనసు పూర్తిగా గ్రహించలేనిది. మన రహస్య పాపాలు మనకే తెలియనంతగా లోతుగా దాగి ఉంటే కూడా, పరలోక తండ్రికి అవన్నీ బహిరంగమే. ఆయన పరిశుద్ధుడు గనక మన జీవితం కూడా పరిశుద్ధత వైపు సాగాలి.

సైనికులు ఆయన మరణించాడో లేదో పరీక్షించడానికి ఆయన డొక్కలో బల్లెపోటు వేశారు. కానీ ఆయన అప్పటికే తన ఆత్మను తండ్రి చేతుల్లో అప్పగించి శ్వాస విడిచాడు. ఇది పరిపూర్ణ త్యాగం. ఇది తానుండగానే మరొకరికి జీవితం ఇవ్వాలన్న ప్రేమ.

అయన చెప్పినట్లే మూడవరోజు తిరిగి లేచాడు. అది మనకు నిత్య జీవానికి ద్వారం. ఆయన పునరుత్థానం ద్వారా మన ఆశ సజీవంగా మారింది. ఈ జీవితం అనంతమైనదిగా మారింది. ఆయన మరణాన్ని అంగీకరించి, ఆయన రక్తాన్ని నమ్మినవారికి పాప మాఫీ ఉంది. పరిశుద్ధత కలిగి జీవించినవారికి నిత్య రాజ్యంలో స్థానం ఉంది.

ఈ గుడ్ ఫ్రైడే రోజు మన హృదయాలలో త్యాగం పరాకాష్టను మన కళ్లముందు ఉంచుకుందాం. మనం పొందవలసిన శిక్షను ఆయన భరించాడు. మనం పొందలేని నిత్యజీవాన్ని ఆయన మనకు దక్కజేశాడు. ఆయన కొరకు మన జీవితాన్ని పరిశుద్ధంగా నడిపించుకుందాం. ఆయన ప్రేమను గౌరవిద్దాం. నమ్ముదాం. జీవిద్దాం.



✍🏿….. రత్నం నాని




You may also like...

Translate »