చేవెళ్లలో భయానక రోడ్డు ప్రమాదం,ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీ

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల:


చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సహాయంతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు హైదరాబాద్ నుండి వనపర్తి వైపు వెళ్తుండగా, ఎదురు దిశనుంచి వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొన్నట్లు తెలిసింది. ఢీ బలానికి బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమై, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

You may also like...

Translate »