తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ

తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ
హైదరాబాద్: తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆ తరువాత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. డిసెంబరు ఆఖరి వారం నుంచి చలి తీవ్రత పెరగడంతో పాటు శీతల గాలులు వీస్తాయన్నారు. ”రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతోంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండ్రోజులుగా కిందిస్థాయి నుంచి తూర్పుదిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది” అని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
