దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది
బిజెపి అధికారంలోకి వస్తే మీడియా సమావేశాలు కూడా ఉంటాయో లేదో..?
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్
షాద్ నగర్ లో మీడియా ప్రతినిధుల సమావేశం
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, శాసన కార్య నిర్వాహక న్యాయ వ్యవస్థ సైతం విధ్వంసం అవుతుందని రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని ప్రజాస్వామ్య విలువలు పెరగాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిపి జేఏసీ ) కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ సమానత్వం అన్నారు. ప్రేమ పునాది మీదనే సమాజ నిర్మాణం జరగాలని కానీ నేడు దేశంలో రాను రాను మానవ సంబంధాలు కోల్పోతున్నామని సమాజంలో కనీస విలువలు ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు నేటి పాలకులు తూట్లు పొడుస్తూ ప్రశ్నించే మేధావులను రచయితలను న్యాయవాదులను జర్నలిస్టులను అక్రమ కేసులతో జైల్లో నిర్బంధిస్తున్నారని మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగ వ్యవస్థలు మరింత విధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నాయని 2024 తర్వాత మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే జర్నలిస్టులతో కలిసి ఇలాంటి మీడియా సమావేశాలు ఉంటాయో లేదో అనే అనుమానం తలెత్తుతుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సింది మేధావులు కవులు రచయితలు జర్నలిస్టులే కాదు ప్రజలు కూడా చైతన్యవంతమై ప్రశ్నించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని కానీ ప్రస్తుతం ప్రజల మధ్య కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేదన్నారు. అభివృద్ధి గురించి ఎంతో చెప్తున్నా అస్సలు ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాల తీరును ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తున్న నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల వ్యాప్తంగా 10 రోజులపాటు ఈ మీడియా సమావేశాలు కొనసాగుతాయన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రొఫేసర్ వనమాల, రాఘవాచారి, రవిచంద్ర, ప్రజా సంఘాల నాయకులు వెంకటరమణ, జనార్దన్ అర్జునప్ప, రవీంద్రనాథ్, రాము, అనంతయ్య, కరుణాకర్, బాల్ రాజ్, బీజిలిసత్యం, బుస జంగయ్య, మందారం నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.