సరిత టీచర్ కు సరిలేరెవ్వరు..

సరిత టీచర్ కు సరిలేరెవ్వరు..


అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఆడుతూ శిక్షణ ఇస్తున్న సరిత టీచర్.


విద్యార్థులకు ఆకట్టుకుంటున్న టీచర్ బోధన. మారుమూల గ్రామమైన అంగనవాడిలో ఉత్తమ సేవలు .


నవతెలంగాణ – బోధన్


నేటి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు అంటే కొంతమంది నిర్లక్షంగా వ్యవహరిస్తూ సరిగా పట్టించుకోరు. అది మారుమూల గ్రామమైతే అస్సలు పట్టించుకోరు. కానీ ఓ అంగన్వాడి టీచర్ విద్యార్థులకు ఆకట్టుకునేలా విద్యాబోధన చేస్తూ వారికి ఇష్టమైన టీచర్ గా పేరు తెచ్చుకున్నారు . బోధన్ మండలానికి మారుమూల గ్రామమైన హంగర్గా గ్రామంలో గల అంగన్వాడి టీచర్ సరిత గత 17 సంవత్సరాల నుండి అంగన్వాడి టీచర్ గా పని చేస్తున్నారు.

ఈ అంగన్వాడి కేంద్రంలో 15 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే చిన్నారులకు ఆమె వినూత్న రీతిలో అక్షరాలు, నీతి కథలు బోధించడంతో పిల్లలు క్రమం తప్పకుండా ఆమెను అనుసరిస్తున్నారు. విధిగా అంగన్వాడి కేంద్రానికి హాజరవుతున్నారు .
ఆట, పాటలతో విద్యాబోధన..


అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలకు ఆమె ప్రేమగా లాలిస్తూ వారిని బుజ్జస్తు అంగన్వాడీ కేంద్రానికి అలవాటు అయ్యేలా చేస్తున్నారు. అలాగే తెలుగు, ఇంగ్లీష్ అక్షరాలు వారికి అర్థమయ్యేలా వారి మాటలలో బోధిస్తున్నారు. ఇంగ్లీష్ పదాలలో అక్షరాలను గుర్తించేలా ప్రత్యేకంగా చార్ట్ తయారుచేసి దానిని విద్యార్థులు గుర్తించేలా తర్ఫీదునిస్తున్నారు.

అంతేకాకుండా వారిలో క్రమశిక్షణ పెంపొందించేలా నీతి కథలు చెబుతూ బోధిస్తున్నారు. పిల్లలు నీతి కథలు ఆకర్షతులై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే గర్భిణీలకు ప్రతి శుక్రవారం, శనివారం పాలు, పెరుగు, కూరగాయల భోజనం అందిస్తున్నారు. చిన్నారులకు ప్రతి బుధవారం గుడ్లు, ఆకుకూరల వంటలతో పౌష్టికాహారం అందిస్తున్నారు.

అలాగే విద్యార్థుల శారీరక అభివృద్ధిపై వారి ఎదుగుదలలో ఉండే మార్పులను, వారు నేర్చుకున్న అంశాలపై ఆమె ఎప్పటికప్పుడు సూపర్ వైజర్ ద్వారా ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు చేరువ చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. దాంతో అంగన్వాడి టీచర్ సరిత అందిస్తున్న సేవలను సరిత టీచర్ కు సరిలేరెవ్వరు అని గ్రామస్థులు కొనియాడుతున్నారు .

You may also like...

Translate »