కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం.. భద్రాద్రి రామయ్య

దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో.. సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చలహారంతో.. సీతారాములు మెరిసిపోయారు. మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల నడుమ రాములోరి కళ్యాణం వైభవంగా సాగింది. వేదమత్రోచ్ఛరణలు, రామనామ స్మరణతో మిథిలా స్టేడియం మార్మోగిపోయింది. ముందుగా.. సీతా సమేతంగా రాముల వారిని ప్రత్యేక పల్లకీలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి పల్లకిపై మేళ తాళాలతో కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చారు.

ఆ తర్వాత.. కళ్యాణ క్రతువు పూర్తి చేసి.. అభిజిత్ లగ్నంలో సీతమ్మపై జీలకర్ర బెల్లం పెట్టించారు పూజారులు. ఆ వెంటనే.. సీతమ్మకు.. రామదాసు చేయించిన తాళిబొట్టును భక్తులందరికీ చూపించారు. రాములోరి చేతి దగ్గర ఉంచి మాంగళ్యధారణ చేయించారు. ఏడాదికోసారి జరిగే అద్భుతఘట్టం ఇది. రాములోరి కళ్యాణం చూసి భక్తులంతా పులకించిపోయారు. కొలిచిన వారి కొంగుబంగారంగా ప్రతీతి ఉన్న భద్రాద్రి రామయ్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు రామనామాన్ని స్మరించారు. కళ్యాణ వేదిక ప్రాంగణమంతా భక్తుల జయజయ నినాదాలతో, గోవింద నామస్మరణతో మార్మొగిపోయింది.

You may also like...

Translate »