ఆశావర్కర్ పై లైంగికదాడి .. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

జ్ఞాన తెలంగాణ,డెస్క్ : జగిత్యాల జిల్లా రాయికల్‌లో దళిత మహిళైన ఆశావర్కర్ విధులను పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితున్ని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని విమర్శించారు. ఆ నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇవి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మహిళల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధితురాలికి సరైన వైద్యం అందించలేదని తెలిపారు. పోలీస్ యంత్రాంగం నిందితునికి అండగా ఉండి, బాధితురాలికి అన్యాయం చేసే వైఖరిని అవలంబిస్తోన్నట్టు కనపడుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలికి సరైన వైద్యం అందించాలనీ, ఇంటి స్థలమిచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, ఇతర ఆర్థిక సహాయ సహకారాలను ప్రభుత్వం అందించాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.