ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు

ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు


  • ఒకే ఇంటి ఓటర్లు వేర్వేరు వార్డుల్లో – ప్రజల్లో గందరగోళం
  • “ఎక్కడివారిని అక్కడే ఉంచాలి” – గళ మెత్తిన ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు
  • ఓట్ల సవరణ గడువు పొడిగించాలి – ఎంపీడీవోకు గ్రామ ప్రజల వినతి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:
ఓటర్ లిస్ట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల శంకర్‌పల్లి మండల పరిధిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు గ్రామంలో జరిగిన అవకతవకలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి. నివసించేది ఒక వార్డులో కాగా, ఓటు హక్కు మరొక వార్డులో కేటాయించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల ఓట్లు కూడా వేర్వేరు వార్డుల్లో పడటం గమనార్హం.

గ్రామ ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం – “ఒక గల్లీలో నివసిస్తున్నవారిని వేర్వేరు వార్డుల్లో చేర్చారు. ఒకే కాలనీలోని ఓటర్లను కూడా తారుమారు చేసి, ఊరి మధ్యలో నివసించే వారిని మరొక చివర ఉన్న వార్డుకు, బయట పక్క వీధుల్లో ఉన్న వారిని ఊరి మధ్య వార్డుకు మార్చేశారు. ఇలాగే కొనసాగితే రేపు ప్రజా సమస్యలు వస్తే ఎవరిని నిలదీయాలో తేలని పరిస్థితి ఏర్పడుతుంది. సమస్య వార్డుమెంబరు చెప్పినా, మరొకరు మనం ఆ వార్డులో లేమని చెప్పే పరిస్థితి వస్తుంది” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు తలలు పట్టుకుంటూ – “మాకు కావలసింది చాలా సింపుల్. ఎక్కడివారిని అక్కడే ఉంచాలి. గృహాల సముదాయం ప్రకారం, గల్లీవారీగా, కాలనీ వారీగా ఓటర్ లిస్ట్ ఉండాలి. అప్పుడే సమస్యలు రాకుండా ఉంటాయి” అని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించాలని, క్రమ పద్ధతిలో ఓటర్ జాబితా సవరించాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్‌ను ప్రజలు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కోరుకుంటున్నది వార్డువారీగా ఖచ్చితమైన ఓటర్ జాబితా ఉండాలని, యాదృచ్ఛికంగా పేర్లు మార్చడాన్ని నిలిపివేయాలని.

ఇక ఈరోజు ఓటర్ లిస్ట్ సవరణకు చివరి తేదీ కావడంతో, గడువు పొడిగించాలని ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు ఒకే స్వరంతో డిమాండ్ చేస్తున్నారు. “మాకు మా పేర్లను సరిచేసుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి కనీసం కొంత భరతమైన సమయం ఇవ్వాలి. ఈరోజు గడువు పూర్తయితే ప్రజలకు మరింత ఇబ్బందులు తలెత్తుతాయి” అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై గ్రామ సెక్రటరీ శ్రీనివాసుతో పాటు ఎంపీడీవో వెంకయ్య గౌడ్‌కు విజ్ఞప్తులు సమర్పిస్తూ, “ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమైనది. అలాంటి ఓటు హక్కు చెల్లాచెదరుగా కాకుండా క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని వారు కోరుతున్నారు.

You may also like...

Translate »