తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం
ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ
జ్ఞాన తెలంగాణ ( హైదరాబాద్ న్యూస్).పొగాకు, నికోటిన్లను కలిగిన ఉత్పత్తులు, ప్యాక్ చేసిన గుట్కా, పానమసాలాల తయారీ, విక్రయాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఉత్పత్తుల నిల్వ, పంపిణీ, రవాణాపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. మే 24 నుంచే ఈ బ్యాన్ అమల్లోకి వచ్చేసిందని తెలిపింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం – 2006లోని సెక్షన్ 30 లోని సబ్- సెక్షన్ (2)లోని క్లాజ్ (a) కింద లభించే అధికారాలను వినియోగించే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రత, ప్రమాణాల రెగ్యులేషన్స్- 2011 ప్రకారం ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం (గుట్కా బ్యాన్) తీసుకున్నట్లు పేర్కొంది. బ్యాన్ కు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణలోని అన్ని పోలీస్ కమిషనరేట్లతో పాటు ఆర్టీసీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించారు. ఆర్టీసీ బస్సులు, ట్రైన్లలో పాన్ మసాలాలు, గుట్కాలను రవాణా చేయడంపైనా నిషేధం అమల్లో ఉంటుంది. దీనిపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే తమిళనాడులో కూడా గుట్కాలు, పాన్ మసాలాలపై బ్యాన్ ఉంది.
గుట్కా తింటే ఎన్నో అనర్థాలు
గుట్కా నమలడం వల్ల పళ్ల మీద మరకలు, పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ముక్కుకు వాసనలు, నోటికి రుచి తెలియవు. లాలాజలం తగ్గుతుంది.
దంతక్షయం పెరుగుతుంది. పంటిమీద ఎనామిల్ దెబ్బతింటుంది. పుప్పిపళ్లు, చిగుళ్ల సమస్యలు ఏర్పడతాయి.
వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
పొగాకు వల్ల చిగుళ్ల వద్ద మృతకణాలు మరింతగా పేరుకుపోతాయి. పొగతాగేవారితో పోలిస్తే పొగాకు నమలడం, గుట్కా రూపంలో చప్పరించడం అలవాటుగా ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
