భయంకరమైన ఎల్వర్తి మలుపు పది రోజుల్లోనే రెండో లారీ బోల్తా! డ్రైవర్ క్షేమం.

జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి ,డిసెంబర్ 01


శంకరపల్లి మండల కేంద్రం పరిధిలోని ఎల్వర్తి మలుపు మరోసారి ప్రమాదాలకు వేదికగా మారింది. గత పది రోజుల క్రితం ఒక లారీ బోల్తా పడిన ఘటన మరువక ముందే, తాజాగా ఈ రోజు 01-12-2025 నా మరో సిమెంట్ లారీ బోల్తా పడటం స్థానికులను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
ఈ ఉదయం 6 గంటల సమయంలో, సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఎల్వర్తి మలుపు వద్ద అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. మలుపు యొక్క తీవ్రత ఎక్కువగా ఉండటం, లారీ వేగాన్ని నియంత్రించలేకపోవటం వలన ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు. ఆయన క్షేమంగా ఉన్నట్లు సమాచారం.సరిగ్గా 10 రోజుల క్రితం కూడా ఇదే మలుపు వద్ద ఒక లారీ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పలుచోట్ల ఎక్కువ మలుపులు ఉండటం వల్లే ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ లారీలు బోల్తా పడటం వల్ల రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అత్యవసర పనులు, రాకపోకలకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మలుపు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో కనిపించే రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని, అలాగే రోడ్డు ఇంజనీరింగ్‌ను పరిశీలించి మలుపులను కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేయాలని గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

You may also like...

Translate »