ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి

Oplus_0

ఎటపాక : ‘ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి. ఈ రోడ్డు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేదంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్‌ వర్క్‌ చేయించమంటారా?’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్‌అండ్‌బీ అధికారిని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల బుధవారం భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్తూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక- కన్నాయిగూడెం రహదారిలో ప్రయాణించారు. ఎటపాక, చింతలగూడెం, కన్నాయిగూడెం ప్రాంతాల్లో పెద్దపెద్ద గుంతలు ఉండటంతో తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఏపీ ఆర్‌అండ్‌బీ సీఈ శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 8 కిలో మీటర్లు అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్‌అండ్‌బీ మంత్రిగా పని చేశాను. దుమ్ముగూడెం- చర్ల రోడ్డు పనులు చేయిస్తున్నప్పుడే ఎటపాక నుంచి కన్నాయిగూడెం గ్రామాల మధ్య ఈ 8 కి.మీ. దూరం రోడ్డు వేయించాను. ఆ తర్వాత కనీసం మరమ్మతులు చేయించినట్లు లేదు. మీరు చేయలేకపోతే మేమే ప్యాచ్‌ వర్క్స్‌ చేయిస్తామ’ని అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ రోడ్డుపై ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉందని సీఈకి చెప్పారు. మంత్రి ఫోన్‌కాల్‌పై స్పందించిన సీఈ శ్రీనివాసరెడ్డి.. త్వరలో మరమ్మతులు చేస్తామని చెప్పారు…..

You may also like...

Translate »