తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

జ్ఞాన తెలంగాణ,న్యూస్ డెస్క్ :
గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు దేశ చమురు సంస్థలు స్వల్ప ఉపశమనం కలిగించాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.5 తగ్గించినట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సమీక్షించి సవరించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ సవరణను ప్రకటించారు.
తాజా సవరణ ప్రకారం ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,590.50గా ఉంది. కోల్‌కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750, హైదరాబాద్‌లో రూ.1,812.50గా ఉంది. గత నెలలో ఇవి దీనికంటే రూ.5 ఎక్కువగా ఉండేవి. అయితే, ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల వంట గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో గృహ గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య కొనసాగుతోంది.
వాణిజ్య గ్యాస్ ధరల్లో స్వల్ప తగ్గింపుతో చిన్న వ్యాపారులు, హోటల్ యజమానులు కొంత ఊరట పొందారు. అయితే సాధారణ గృహ వినియోగదారులకు ఇంకా ఎలాంటి ఉపశమనం రాకపోవడం నిరాశ కలిగిస్తోంది.
