పురపాలికల్లో రాజకీయ రగడ – ఉత్కంఠలో ఆశావహులు

ఇంకా కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక – ఉత్కంఠలో ఆశావహులు


జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవడంతో ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, ప్రచారం పూర్తవ్వాల్సి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీల్లో హడావుడి నెలకొంది. అయితే ఎన్నికల సందడి ఎంత పెరిగినా, అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడం గమనార్హం. టికెట్ల ఖరారు ఆలస్యం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ముందుగానే కసరత్తు ప్రారంభించాయి. స్థానిక నాయకులతో సమీక్షలు, సర్వేలు, సామాజిక సమీకరణాలపై చర్చలు జరిగాయి. అయినప్పటికీ కీలక వార్డుల్లో ఎవరు బరిలో దిగాలన్న అంశంపై పార్టీలు తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. గెలుపు అవకాశాలు, సామాజిక వర్గాల సమతుల్యత, స్థానిక రాజకీయాల ప్రభావం వంటి అంశాలు అభ్యర్థుల ఎంపికను క్లిష్టం చేస్తున్నాయి.

నామినేషన్ల ప్రారంభంతో వేగం పెరిగిన రాజకీయాలు

బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవడంతో రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కార్యాలయాలు, నాయకుల నివాసాలు ఆశావహులతో కిటకిటలాడుతున్నాయి. పార్టీ పెద్దలను కలవడం, సిఫార్సులు తెచ్చుకోవడం, స్థానిక స్థాయి నాయకుల మద్దతు కూడగట్టడం వంటి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో పార్టీలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే అభ్యర్థుల ఎంపికలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తిరుగుబాట్లు, అసంతృప్తులు తలెత్తే అవకాశం ఉండటంతో పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను గమనిస్తూ తమ నిర్ణయాలను మార్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ముందస్తుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు

టికెట్ ఖరారు కాకపోయినా, చాలా మంది ఆశావహులు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు. తమకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో వార్డు స్థాయిలో ఇంటింటా తిరుగుతూ పరిచయాలు పెంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు ఈసారి ప్రచారానికి ప్రధాన ఆయుధంగా మారాయి. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వార్డు సమస్యలపై పోస్టులు పెట్టడం, పార్టీ పెద్దలతో దిగిన ఫొటోలను షేర్ చేయడం, అభివృద్ధి కార్యక్రమాలపై అభిప్రాయాలు వెల్లడించడం సాధారణమైంది.

అలాగే ఓటర్ల జాబితాలను వర్గాల వారీగా విశ్లేషించి, ప్రభావం చూపే వ్యక్తులు, కుల సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. ఈ ముందస్తు కసరత్తు అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో సాగుతోంది.

పొత్తుల చర్చలు – ఆశలకు గండి

అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షం, వామపక్ష పార్టీలు పొత్తులపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పొత్తులపై స్పష్టత రాకపోవడం వల్ల ఆశావహుల్లో అయోమయం నెలకొంది. చివరి నిమిషంలో పొత్తులు ఖరారైతే, కొన్ని వార్డులు మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం ఉంది. అలా జరిగితే ఇప్పటివరకు టికెట్ ఖాయమని భావించిన పలువురు ఆశావహులకు నిరాశ తప్పదు.

పొత్తుల సర్దుబాట్లు రాజకీయంగా అవసరమైనప్పటికీ, స్థానిక స్థాయిలో అసంతృప్తులను పెంచే ప్రమాదం ఉంది. ఇదే అంశం పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేస్తోంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వార్డులను వదులుకోవాలా? లేక ఒప్పందాల కోసం త్యాగం చేయాలా? అన్న చర్చలు పార్టీ అంతర్గతంగా కొనసాగుతున్నాయి.

ఆశావహుల్లో ఉత్కంఠ – కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు

పురపాలక ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో కీలక మలుపుగా భావించబడతాయి. ప్రజాప్రతినిధిగా ఎదగడానికి ఇది తొలి మెట్టు కావడంతో క్రియాశీలక కార్యకర్తలు ఈ అవకాశాన్ని వదులుకోవాలని భావించడం లేదు. అందుకే అధికార పార్టీలోని ఆశావహులు ఎమ్మెల్యేలు, మంత్రుల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తుండగా, ఇతర పార్టీల వారు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా నాయకులను కలుస్తున్నారు.

టికెట్ కోసం సిఫార్సులు, రాజకీయ సమీకరణాలు, ఆర్థిక బలం వంటి అంశాలు కీలకంగా మారాయి. షెడ్యూల్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎప్పుడు తుది జాబితా వెలువడుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.

పోటీ చేసేందుకు అవసరమైన అర్హతలు

పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతలు, డిపాజిట్, ఎన్నికల వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో పోటీ చేసే అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి. కనీస వయస్సు 21 సంవత్సరాలు కావాలి. కౌన్సిలర్‌గా పోటీ చేయాలంటే సంబంధిత మున్సిపాలిటీలోని ఏదైనా ఒక వార్డులో ఓటరుగా నమోదు అయి ఉండాలి. కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే ఆ కార్పొరేషన్‌లోని డివిజన్‌లో ఓటరుగా ఉండాలి.

పార్టీ తరఫున పోటీ చేస్తే ఒక ఓటరు ప్రతిపాదించాలి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగితే పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఒక ఓటరు ఒకరినే ప్రతిపాదించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అనర్హులెవరు?

ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి సంబంధిత మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్‌గా ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా వాటి అనుబంధ సంస్థల్లో లాభదాయక పదవులు చేపట్టిన వారు అనర్హులు. ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగింపుకు గురైన వారు కూడా పోటీ చేయలేరు. గత ఎన్నికల్లో ఖర్చుల వివరాలు సమర్పించని కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హుల జాబితాలో ఉన్నవారు కూడా ఈసారి బరిలో నిలవడానికి వీలు లేదు.

You may also like...

Translate »