PM Modi: బాల రాముడిపై సూర్యతిలకాన్ని దర్శించిన ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్..

ప్రధాని మోదీ బుధవారం అసోంలోని నల్భరీలో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పడే అద్భుత ఘట్టాన్ని నేరుగా తిలకించలేకపోయారు. కానీ ఎన్నికల షెడ్యూల్లో బిజీగా ఉన్నప్పటికీ అసోంలోని నల్బరీ ర్యాలీలో పాల్గొన్న తరువాత తిరుగుప్రయాణంలో తన ప్రత్యేక హెలీకాఫ్టర్లో అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ.
అయితే ఈ సుందర ఘట్టంలో నేరుగా పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ ఇలా ఒక మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం లభించింది అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన చేతిని హృదయంపై ఉంచి కాళ్లకు ఉన్న బూట్లను తీసి పక్కన పెట్టి బాలరాముడిని మనసా, వాచా, కర్మణా స్మరిస్తూ కొన్ని క్షణాలు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు ప్రధాని మోదీ.