ఫోన్ ట్యాపింగ్, నోటీసులు…వాస్తవాలపై ప్రశ్నలే నేరమా?

- ఓటుకు నోటు కేసు.. ఫోన్ ట్యాపింగ్ వివాదానికి ఆరంభం
- ఇంటెలిజెన్స్ వ్యవస్థ పాత్రపై నైతిక ప్రశ్న
- కాంగ్రెస్ ప్రభుత్వంలో సిట్ విచారణల సీరియల్
- ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు – వాస్తవాల ప్రస్తావన మాత్రమే
- నోటీసులు, అర్థరాత్రి చర్యలు – ప్రజాస్వామ్యానికి ఏ సందేశం?
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్(ప్రత్యేక వ్యాసం) :
డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ నేతృత్వంలో జారీ అయిన నోటీసులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి పౌరుడి మనసులోనూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల తగాదా కాదు. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, అధికార వ్యవస్థ నిష్పక్షపాతత్వం, దర్యాప్తు సంస్థల నైతిక బాధ్యత, అలాగే పాలకులు ప్రతిపక్షాలపై అధికారాన్ని ఎలా వినియోగిస్తున్నారన్న మౌలిక అంశాలకు సంబంధించిన వ్యవహారం.
ఈ నేపథ్యంలో “అసలేంటి కథ?” అనే ప్రశ్న సహజంగానే ప్రజల ముందుకు వస్తోంది. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏవీ కొత్తగా సృష్టించిన ఆరోపణలు కావు. ఆయన ప్రస్తావించిన అంశాలన్నీ గతంలో ప్రజల ముందే, మీడియా ముందే, న్యాయవ్యవస్థ ముందే చర్చకు వచ్చిన వాస్తవాలే.
2015లో జరిగిన “ఓటుకు నోటు” కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం, ఆ వ్యవహారానికి చంద్రబాబు నాయుడు పరోక్షంగా దిశానిర్దేశం చేశారన్న ఆరోపణలతో ఆడియో ఫుటేజ్ వైరల్ కావడం ఇవన్నీ రాజకీయ చరిత్రలో నమోదైన సంఘటనలే. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా కుదిపేసింది.
ఈ ఘటన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ అక్రమమని, అది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెబుతూ అప్పటి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అలాగే ఇంటెలిజెన్స్ అధికారులపై అనేక చోట్ల ఫిర్యాదులు చేశారు. చిత్తూరు, కడప, విజయవాడ, తూర్పు గోదావరి సహా పలు జిల్లాల్లో ఈ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇవన్నీ రాజకీయ ప్రచారం కాదు; అధికారికంగా నమోదైన వాస్తవాలే.
అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఈ రోజు మొదలైనది కాదు. ఇది పదేళ్ల క్రితమే దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన తీవ్రమైన అంశం. అప్పట్లో ఇది తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ వివాదంగా కూడా మారింది. ఈ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మాట్లాడటం నేరం కాదు; ప్రజల జ్ఞాపకాలను తాజా చేయడమే.
ఆ కాలంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసిన అధికారుల్లో ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ పత్రికా సమావేశంలో ప్రస్తావించిన ప్రధాన అంశం ఇదే. “ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుందో మీకు తెలియదా? మీరు కూడా ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు కదా?” అనే ప్రశ్న వ్యక్తిగత దూషణ కాదు. అది ఒక వ్యవస్థాపక ప్రశ్న, ఒక నైతిక ప్రశ్న.
ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్లీ తెరపైకి రావడం యాదృచ్ఛికం కాదన్న భావన బలపడుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ అంశం ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. 2024 మార్చిలో ఒక ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి, సుమారు 350 మందికి పైగా వాంగ్మూలాలు సేకరించారని చెబుతున్నారు. కానీ ఇంత పెద్ద దర్యాప్తు జరిగినప్పటికీ ఇప్పటివరకు ప్రజలకు స్పష్టంగా తెలియజేసిన విషయం ఏమిటి?
ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు? అది చట్టబద్ధమా? అక్రమమైతే బాధ్యులు ఎవరు? ఎవరి ఆదేశాలతో జరిగింది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. సిట్ అధికారులు గానీ, రాష్ట్ర హోం మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ ఈ విషయాలపై ప్రజల ముందుకు వచ్చి వివరించలేదు. ఈ మౌనం ప్రజల్లో అనుమానాలను మరింత బలపరుస్తోంది.
ఈ పరిస్థితుల్లోనే రెండోసారి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు కావడం, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి సుమారు ఏడు గంటల పాటు విచారించడం, అంతకు ముందు మాజీ మంత్రి హరీష్ రావును కేసుతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా తొమ్మిది గంటల పాటు విచారించడం ఈ పరిణామాలన్నీ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి.
ఈ విచారణల మధ్యలోనే ప్రవీణ్ కుమార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పత్రికా సమావేశం నిర్వహించి, కొన్ని మౌలిక ప్రశ్నలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉందా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతున్న కాలంలో ఉన్న డీజీపీ, హోంశాఖ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ఎందుకు వారిని విచారించడం లేదు? అనే ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో సహజంగా అడగాల్సిన ప్రశ్నలే.
అలాగే, ఓటుకు నోటు కేసు సమయంలో ఫోన్ ట్యాపింగ్ అక్రమమని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ డీఐజీగా ఉన్న అధికారి సజ్జనార్. అలాంటి పరిస్థితిలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏర్పాటు చేసిన సిట్‌కు ఆయనే నాయకత్వం వహించడంపై నైతిక అర్హత ప్రశ్నించడంలో తప్పేముంది? ఇది వ్యక్తిని కించపరచడం కాదు; దర్యాప్తు వ్యవస్థపై ప్రజలకు ఉండాల్సిన నమ్మకానికి సంబంధించిన ప్రశ్న.
ఇక్కడ అత్యంత కీలకమైన అంశం..ప్రవీణ్ కుమార్ చెప్పిన సమాచారం అబద్ధమా? వాస్తవాలకు విరుద్ధమా? ప్రజలకు అందుబాటులో లేని రహస్య సమాచారమా? అబద్ధాలు చెప్పి ఉంటే, వ్యక్తిగత దూషణలు చేసి ఉంటే, కించపరిచేలా మాట్లాడి ఉంటే చట్టపరమైన చర్యలు సమంజసమే. కానీ ప్రజా రికార్డుల్లో ఉన్న విషయాలను ప్రస్తావించడమే నేరంగా మారితే, అది రాజ్యాంగానికి విరుద్ధం కాదా?
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హక్కుగా కల్పించింది. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయాలను ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికీ ఉంది. ప్రవీణ్ కుమార్ రహస్యంగా ఏమీ మాట్లాడలేదు. ప్రజల సమక్షంలో, మీడియా ముందు బహిరంగంగా మాట్లాడారు. ఆయన చెప్పింది అసత్యమైతే, అదే బహిరంగ వేదికపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టవచ్చు. కానీ నోటీసులు ఇచ్చి భయపెట్టడం ప్రజాస్వామ్యానికి ఏ సందేశాన్ని ఇస్తుంది?
అంతేకాదు, అర్థరాత్రి 12 గంటలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇది సాధారణ న్యాయపరమైన ప్రక్రియేనా? లేక రాజకీయ ఒత్తిడితో తీసుకున్న చర్యలా కనిపిస్తున్నదా? దావోస్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈ నోటీసులు ఇచ్చారన్న అనుమానాలు రావడానికి కారణం కూడా ఈ అసాధారణ పరిణామాలే.
ఇప్పుడు మరో సహజమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడితే, ఆయనకు మద్దతుగా వాస్తవాలు ప్రస్తావిస్తే, మాకూ నోటీసులు వస్తాయా? లేక “సీన్ రీకన్‌స్ట్రక్షన్” పేరుతో లోపల వేస్తారా? అత్యంత గోప్యంగా జరగాల్సిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నప్పుడు, ఒక వర్గం మాట్లాడితేనే నేరమవుతుందా?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు. వాస్తవాలను చెప్పడం తిరుగుబాటు కాదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండాలంటే దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా కనిపించాలి. లేకపోతే నోటీసులు ఒక ఆయుధంగా, భయపెట్టే సాధనంగా మారతాయన్న అనుమానం బలపడుతుంది.
డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అభిమానులుగా, బాధ్యతగల పౌరులుగా మనం మాట్లాడాల్సింది వ్యక్తులపై ద్వేషంతో కాదు,వ్యవస్థపై ప్రశ్నలతో. అబద్ధాలతో కాదు,వాస్తవాలతో. భయంతో కాదు,రాజ్యాంగం ఇచ్చిన ధైర్యంతో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గొంతులు మూగబోతే, మిగిలేది మౌనం మాత్రమే కాదు,అధికార దుర్వినియోగం.
