జ్ఞాన తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు

  • ఏల్వర్తి గేట్ వద్ద మిషన్ భగీరథ పైపు లీకేజ్‌కు అధికారులు స్పందన
  • తక్షణమే మరమ్మతులు ప్రారంభించిన శంకర్పల్లి మున్సిపల్ అధికారులు

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి భారీగా నీరు వృథా అవుతోందన్న వార్త వెలువడిన వెంటనే శంకర్పల్లి మున్సిపల్ అధికారులు స్పందించారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత ఇంజినీరింగ్, వాటర్ సప్లై విభాగాల సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించి లీకేజ్ మరమ్మతు పనులను ప్రారంభించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే ప్రజాధనం వృథా కాకుండా తక్షణ చర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు. పగిలిన పైపు లైన్‌ను గుర్తించి మరమ్మతులు చేపడుతున్నామని, పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం అయ్యే వరకు సిబ్బంది అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే పైపు లైన్‌ను పూర్తిగా మారుస్తామని కూడా వెల్లడించారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పైపు లైన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. నీటి వృథా అరికట్టడమే కాకుండా ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణకూ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగా వెంటనే స్పందించామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు ఎదురైతే ప్రజలు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి లేదా అధికారులకు సమాచారం ఇవ్వాలని శంకర్పల్లి మున్సిపల్ అధికారులు కోరారు.

ఉదయం : ఎల్వర్తి గేటు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ 👆

జ్ఞానతెలంగాణ పత్రికలో కథనం 👆

మున్సిపల్ అధికారుల స్పందనతో ప్రారంభమైన పనులు 👆

You may also like...

Translate »