బహుజనులకేమో ఉచితాలు వద్దు, బనియాలకేమో రుణమాఫీలు కరెక్టా- సమతా సైనిక్ దళ్

బహుజనులకేమో ఉచితాలు వద్దు, బనియాలకేమో రుణమాఫీలు కరెక్టాసమతా సైనిక్ దళ్


అగ్రహారంలోని సుప్రీంకోర్టు తన మనుస్మృతిలోని నిబంధన ప్రకారం ఉచిత పథకాలు వద్దనే తీర్పు, ఈ దేశ మూలనివాసుల బ్రతుకు జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. మౌలికంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అయితే, పెద్ద పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడాన్ని ప్రశ్నించకపోవడం ఏమిటి? ఉచిత పథకాలు, రుణమాఫీలు, పారిశ్రామికవేత్తల రుణ రద్దులు, ఆర్థిక అసమానతలపై సుప్రీంకోర్టు వైఖరి ఎంత మాత్రం సమర్థనీయం కాదు? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడింది.

ఫిబ్రవరి 12, 2025న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయ్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం నగర ప్రాంతాల్లో నివాస గృహలు లేని వారి హక్కుకు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో జరిగింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పక్షాలు ఉచితంగా ఆహార ధాన్యాలు మరియు ఇతర ప్రయోజనాలను అందించడం సమాజంపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానిస్తూ, “ఇలా ఉచిత సాయాలు అందిస్తూ మనం పరాన్నజీవుల (‘పారాసైట్లు’) తరాన్ని సృష్టిస్తున్నామా?” అని ప్రశ్నించారు.
“ఎన్నికల సమయంలో ప్రజలు పని చేయడానికి సిద్ధంగా ఉండరు. పని చేయకుండానే వారికి ఉచిత రేషన్ లభిస్తోంది!” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక, “ప్రజలను ప్రధాన స్రవంతిలో కలిపి, దేశ అభివృద్ధికి తోడ్పడేలా చేయాల్సిందిపోయి, వారిని పూర్తిగా ప్రభుత్వ సహాయంపై ఆధారపడేలా చేస్తున్నామా?” అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉచిత వాగ్దానాల ప్రాముఖ్యత మరియు వాటి సమాజపైన ప్రభావం గురించి కొత్త చర్చకు దారితీసాయి.

1️⃣. “ఉచితాల” ప్రాముఖ్యత ఏమిటి?
సామాన్య ప్రజలకు ప్రభుత్వాల ద్వారా సంక్షేమ పథకాలు అందించడం కొత్త విషయం కాదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 38(2) ప్రకారం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో, ఆర్టికల్ 39(b)(c) ప్రకారం, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ నియమాలను అనుసరించి, వివిధ ప్రభుత్వాలు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యసేవలు, రేషన్, ఉపాధి హామీ, పింఛన్లు వంటి పథకాలను అందిస్తున్నాయి. ఇవి లేనిపక్షంలో పేదలు ఇంకా కష్టాల్లో కూరుకుపోతారు. ఉదాహరణకు:
1️⃣ఉచిత విద్య లేకుంటే లక్షలాది పేద పిల్లలు చదువుకునే అవకాశం కోల్పోతారు.
2️⃣ఉచిత ఆరోగ్య సేవలు లేకుంటే, కేవలం ధనికులకే మెరుగైన వైద్యం లభిస్తుంది.
3️⃣రేషన్ (పిఎమ్‌జికెఎవై వంటి పథకాలు) లేకుంటే పేద ప్రజలు ఆకలితో అలమటించాల్సి వస్తుంది.
కానీ, ఈ ప్రయోజనాలను సుప్రీంకోర్టు “పరాన్నజీవుల తరగతిని సృష్టిస్తోంది” అనే కోణంలో చూడటం ఏమాత్రం సమంజసం కాదు
.

పారిశ్రామికవేత్తల రుణాల రద్దుపై నిశ్శబ్దం ఎందుకు?
సుప్రీంకోర్టు పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ విమర్శించినప్పటికీ, పెద్ద కార్పొరేట్ల రుణాల రద్దు, ఆదాయపన్ను రాయితీల గురించి ఎలాంటి విమర్శ చేయలేదు. ఇది ద్వంద్వ ప్రమాణాన్ని సూచిస్తోంది. అందులో నిజాలు ఏమిటి?

2014 వరకు భారతదేశ మొత్తం ప్రభుత్వ అప్పు రూ. 55.87 లక్షల కోట్లు మాత్రమే. 2014-2024 మధ్య ఈ అప్పు రూ. 181 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోని టాప్ 10 పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అదానీ, అంబానీ, మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులకు బ్యాంకులు వేల కోట్లు రద్దు చేశాయి.
కానీ, ఈ విషయంపై సుప్రీంకోర్టు విమర్శ చేయడం లేదు. ఎందుకు?
రైతులకు, చిన్న వ్యాపారులకు రుణమాఫీ ఇస్తే అది తప్పా?
కోట్లాది నిరుద్యోగ యువతకు సంక్షేమ పథకాలు అవసరం కాకపోతే, వేల కోట్ల పారిశ్రామిక రుణ మాఫీ అవసరమా?

భారతదేశ అప్పుల భారం ఎవరి వల్ల పెరుగుతోంది?
భారతదేశం 2014 వరకు నిద్రాణస్ధితిలో ఉన్న అప్పును తట్టుకుని అభివృద్ధి చెందింది. కానీ, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు విపరీతంగా పెరిగిపోయింది.
2014 నాటికి దేశపు మొత్తం అప్పు రూ. 62 లక్షల కోట్లు మాత్రమే.
2024 నాటికి అది రూ. 181 లక్షల కోట్లకు పెరిగింది (192% వృద్ధి).
2026 నాటికి రూ. 196 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా
.

ఈ అప్పుతో ఎలాంటి అభివృద్ధి జరిగింది?
భారీ కార్పొరేట్ సంస్థల రుణాలను రద్దు చేసేందుకు మాత్రం ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి.

“ఉచితాలు” అన్నది ఎవరికి వర్తించాలి?
పేదలకు ఇచ్చే రేషన్, ఉపాధి హామీ “ఉచితాలు” అంటారు. కానీ, పెద్ద పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడం “ఆర్థిక సంస్కరణలు” అంటారు.

ఈ వైఖరిలో అసమానత ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఉద్యోగాలు లేకపోతే, పారిశ్రామిక వృద్ధి నెమ్మదిస్తే, సాధారణ ప్రజలు ప్రభుత్వ సంక్షేమానికి ఆధారపడడం సహజమే.

ఐయమ్ఎఫ్, ఆక్స్ ఫామ్ నివేదికలు ఏమి చెబుతున్నాయి?
ఐయమ్ఎఫ్ నివేదిక ప్రకారం:
2022 నాటికి భారతదేశ GDPకి అప్పు 83%. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది అత్యధికం.

ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం:
భారతదేశ సంపదలో 60% పైగా టాప్ 5% ధనికులు కలిగి ఉన్నారు.
దిగువ 50% జనాభా కేవలం 3% సంపదను కలిగి ఉంది. అంటే, సంక్షేమ పథకాలు అవసరమనే స్పష్టమైన సంకేతం

ప్రభుత్వం వ్యయం చేసే ఆదాయంలో ఎవరి వంతు ఎక్కువ?
2023లో జీఎస్టీ ఆదాయం రూ. 14.83 లక్షల కోట్లు. దీనిలో 64% దిగువ 50% ప్రజల నుంచి వసూలైంది. టాప్ 10% నుంచి కేవలం 3% మాత్రమే వచ్చింది.
పేదల నుంచి వసూలైన పన్నును పారిశ్రామికవేత్తలకు రాయితీలుగా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమా?ళఅదే పన్నును పేదల సంక్షేమానికి ఉపయోగించకూడదా?

ఉచితాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అర్థవంతమైన ప్రశ్న కానే కాదు.
“మనం పరాన్నజీవుల తరగతిని సృష్టిస్తున్నామా?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కానీ, పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేయడం, బ్యాంకులను నష్టాల్లోకి నెట్టడం కూడా ఇదే ప్రశ్నకి లోబడ్డదే కదా?
రైతులకు రుణమాఫీ చేయకూడదు అంటారు, కానీ వేల కోట్ల పారిశ్రామిక రుణాల మాఫీ మాత్రం జరిపారు.
కోట్లాది నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తుంటే, కార్పొరేట్ దిగ్గజాలకు పన్ను రాయితీలు ఇవ్వడమే ఎందుకు ప్రాధాన్యం?

“తీరని అన్యాయం, ద్వంద్వ ప్రమాణాలు”
రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు తప్పయితే, కేంద్రం కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడమూ తప్పే కదా? పేదలకు ఇచ్చే రేషన్ “ఉచితాలు” అయితే, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే వేల కోట్ల రాయితీలు ఏమిటి? ప్రభుత్వ భూసంపద, బ్యాంకుల నిధులు, పన్ను రాయితీలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి?
ఈ ప్రశ్నలకు సమాధానం లేనిదే, “ఉచితాలు” అనే విమర్శలకు న్యాయం ఉండదు!


బేతాళ సుదర్శనం
భారతీయ బౌద్ధ మహాసభ
సమతా సైనిక్ దళ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు

You may also like...

Translate »