మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్


మంత్రి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ హస్తం

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే గడువులోగా పథకాలన్నింటికీ లబ్ధిదారులుగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే వారిని ఎంపిక చేయాలని  పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ,లేఖ విడుదల చేశారు. మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు తెలిపే గ్రామాలల్లో దళితబంధు కేటాయించి ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపని ప్రజల మధ్య కుల,మత విద్వేషాలు,హింసలు సృష్టించేలా వివాదాస్పదంగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి విడుదల చేయాలని ఎన్నికల్లో గెలవాలని పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకొని,వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

అందంగా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీఆర్ఎస్ నీచపు బుద్ధి మానుకోవాలని హితవు పలికారు.
మంత్రి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951, ఇండియన్ పీనల్ కోడ్- 1860 ఉల్లంఘించడమేనని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా  జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

You may also like...

Translate »