కార్మిక సమ్మె 8 గంటల పని హక్కులను హరిస్తున్న మోడీ ఫాసిస్టు పాలను తిప్పికొట్టండి

కార్మిక సమ్మె 8 గంటల పని హక్కులను హరిస్తున్న మోడీ ఫాసిస్టు పాలను తిప్పికొట్టండి
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ ,మే 1: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో,సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కాన్ కుర్తి,ఉడ్మల్ గిద్ద గ్రామాలలో 138వ మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది.*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి, రైల్వే,రిలయన్స్ అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వారికి కట్టబెట్టారు.బ్యాంకుల నుండి రుణాలు పొందిన వాటిని రద్దు చేయడం లాంటి చర్యల ఫలితంగానే ప్రభుత్వ సహాయంతో అనేక టెండర్లను చేజిక్కించుకోవడం వల్ల అదానీ, అంబానీలు ఎదిగిపోయారు. మోడీ అధికారం కొచ్చిన ఈ 10 ఏండ్ల కాలంలోనే 10 లక్షల కోట్ల (నాన్ ప్రొఫెర్మెంట్స్ అసెస్ట్స్) నిరర్థక ఆస్తులు బ్యాంక్ ఖాతా నుండి ఎత్తి వేశారు. సామాన్యుల రుణాల వసూళ్ళను చుక్కలు చూయించే బ్యాంకులు, పారిశ్రామికవేత్తల రుణాల రద్దుకు మోడీ ఒక్క కలం పోటుతో కోటానుకోట్ల రూపాయలను మిగిల్చారు.
కార్మిక వర్గము పోరాడి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాల్లో, 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ మార్చివేసి మిగతా 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేశారు. ఈ నాలుగు లేబర్ కోడ్స్లో కార్మిక సమ్మె పై అనేక ఆంక్షలు మరియు 8 గంటలకన్నా అధిక గంటలు పని చేయించుకోవచ్చనే నిబంధన,ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ వంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఈ నాలుగు లేబర్ కోడ్స్లో పొందుపరిచారు.8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయొచ్చనే నిబంధన తీసుకొచ్చిన తర్వాత అడ్డు అదుపు లేకుండా కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి అవకాశం కల్పించినట్లే. 8 గంటల పని దినము నిబంధన ఉన్ననాడు కూడా యాజమాన్యం అధిక గంటలు పని చేయించిన చరిత్ర ఉంది. సెలవులకు కూడా నోచుకోని దయనీయ స్థితి కార్మిక వర్గానికి ఏర్పడబోతుంది. 8 గంటల కంటే అదనంగా పనిచేసిన దానికి ఓటీ రాబట్టుకోవచ్చు అని ప్రభుత్వాలు నమ్మబలుకుతున్నాయి.కార్మిక వర్గానికి న్యాయమైన వేతనాలు అందక, చాలీచాలని వేతనాలతో బతుకు బండి లాగిస్తున్నారు. మరోపక్క ధనికుల సంపద కోటానుకోట్ల రూపాయలు నిత్యం పెరిగిపోతున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి.అసమానతల భారతదేశంగా మారింది.అంబానీ కొడుకు ఫ్రీ వెడ్డింగ్ ఖర్చు 1250 కోట్ల,అంబానీ,ఆదానీ లక్షల కోట్ల సంపద ఎన్ని గంటలు శ్రమ చేసి సంపాదించారో చెప్పగలరా? వారానికి 70 గంటల శ్రమ చేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రకటించాడు.
అలా పనిచేయని వారు సోమరుల కింద లెక్కట, తన మనవడికి 240 కోట్ల రూపాయల విలువ గల బహుమతి ఇచ్చాడట, మనవడి కోసం ఎన్ని గంటలు శ్రమ చేసి సంపాదించారో? 39 వేల కోట్ల సంపదకు అధిపతి అయిన నారాయణమూర్తి ఎన్ని గంటలు శ్రమ చేసి సంపాదించారో చెప్పగలరా? పాలకులు, పారిశ్రామికవేత్తలు చెప్పే నీతులు కట్టిపెట్టి, న్యాయమైనవేతనము, ఉ ద్యోగ భద్రత మరియు సామాజిక భద్రత కల్పించే చర్యలకు పూనుకోవాలి. “వట్టిమాటలు కట్టిపెట్టవోయి, గట్టి మేలు తలపెట్టవోయ్” సంపద సృష్టించే శ్రమజీవులకు న్యాయమైన వేతనము, సామాజిక భద్రత ఉండాలి. కార్మిక వర్గం చైతన్యవంతంగా మే డే స్ఫూర్తితో,హక్కులకై పోరాడాలని, పాలకుల కుట్రలను తిప్పికొట్టాలని, మోడీ ప్రభుత్వానికీ, ఫాసిస్ట్ పాలనకూ చరమగీతం పాడాలని ప్రజలకు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు తాయప్ప,అరుణోదయ జిల్లా నాయకులు మల్లేష్,పివైఎల్ జిల్లా నాయకులు మధు,కార్మికులు మాదే,రాజేష్, శరణప్ప,శ్రీను,బాబు,నరసప్ప,మల్లప్ప, లక్ష్మప్ప తోపాటు ప్రజలు కార్మిక వర్గం పాల్గొన్నారు.
