మనిషి – తేనె

మనిషి – తేనె
ఒకసారి మనిషి ఒక దట్టమైన అడవిలో పని మీద వెళ్తుంటే దారి తప్పిపోతాడు.ఒక ఏనుగు ఆ మనిషి కంట పడింది.వెంటనే భయంతో పరుగు లంకించుకున్నాడు.ఆ ఏనుగు మనిషిని వెంబడించి వస్తూనే ఉంది.ఆ మనిషికి ఒక్కసారిగా ప్రాణం మీద భయం పుట్టింది. ఆ మనిషి పరుగెత్తుతున్న సమయంలో ఒక నుయ్యి కనబడింది. ఆ ఏనుగు బారి నుండి రక్షించుకోవాలని మనిషి ఆ నూతిలోకి దిగాడు.తీరా నూతిలోకి దిగాక నూతిలోపల అడుగున ఒక విష సర్పం కనబడింది. “ముందు నుయ్యి వెనుక గొయ్యి” అంటే ఇదేనేమోనని మనిషికి అనిపించింది.అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ నూతి గోడను ఆనుకుని ఒక ఒక ముళ్ళ తీగ కనబడగా ఆ తీగను పట్టుకొని వేళ్ళాడాడు ఆ మనిషి.ఇంతలో ఆ తీగను సైతం రెండు చుంచులు కొరకడం అతనికి కనిపించింది.ఆ మనిషికి ఎటూ పాలు పోలేదు.అతని గుండె దడ దడమంటూ ఒక్కటే ప్రాణభయంతో వేగంగా కొట్టుకోసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తేనెపట్టు నుండి చుక్కలు చుక్కలు ధారగా పడటం ఆ మనిషికి కనబడింది. ఎప్పుడూ లేనిది ఆ మనిషికి ఆ తేనెను ఆస్వాదించాలనే కోరిక మనసులో కలిగింది. మూడు వైపుల నుండి మనిషిని మరణం చుట్టుముట్టేయగా పట్టించుకోకుండా ఇలా తేనె కోసం ఆరాటపడుతున్నాడు అని మనసులో అనిపించింది ఆ మనిషికి,కానీ ముందు తేనెను ఆస్వాదించాలనే కోరిక కలిగింది. ఇలా ఉంటుండగా ఆ మనిషి పరిస్థితి చూసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని గమనించిన దారిన వెళ్తున్న ఓ దయ గల మనిషి చూసి ఆ మనిషిని కాపాడాలని ప్రయత్నం చేయసాగాడు. తన చేయిని అందించడానికి ప్రయత్నం చేయగా ఆ మనిషి పట్టించుకోకుండా ముందు ఈ తేనెను తాగాలనే పనిలో పడ్డాడు.మూడు వైపులా మరణం ఉందనే స్పృహ ఆ మనిషిలో కలగ లేదు.మరణాన్ని సైతం లెక్కచేయకుండా ఆ మనిషి తేనెను ఆస్వాదించాలనే కోరికతో ఉన్నాడు.
ఈ కథలో దారి తెలియని దట్టమైన అడవిని సంసారంతో పోల్చవచ్చు.దీనినే సంసార చక్రం అంటారు. ఏనుగు మరణంతో పోల్చవచ్చు. మరణం ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.ముసలితనం మనలో విచారాన్ని, అభద్రతా భావాన్ని కలుగజేస్తోంది.ముళ్ళ తీగ మన జీవితాన్ని తెలియజేస్తోంది.మనిషి జీవితంలో అనేక కోరికలను కలిగి ఉంటాడు. అనేక ఇష్టాలను పెంచుకుంటాడు. నెరవేరని కోరికలు వలన మనిషిలో దుక్ఖం కలుగుతుంది. అదేవిధంగా ఆ ముళ్ళ తీగ కూడా పెరిగే క్రమంలో ఇతర మొక్కలను పెనవేసుకుని వేళ్ళాడుతూ పెరుగుతుంది.అదేవిధంగా మనిషి కూడా తన మనసులో కోరికలను పెనవేసుకుని ఉంటాడు.ఇక చుంచులు రెండూ కూడా పగలు, రాత్రికి సంకేతాలు. తేనె చుక్కలు మనిషిలో ఇహపరమైన కోరికలు గురించి తెలియజేస్తాయి.ఇహపరమైన కోరికలు కుప్పలుతెప్పలుగా ప్రవేశించి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కువగా జీవించాలనే దురాశను ఈ కోరికలు పెంచుతాయి.చివరిగా కథలో మనిషిని కాపాడాలని దయ గల మనిషి ప్రయత్నం చేస్తాడు.ఆ మనిషి ఎవరో కాదు తథాగత గౌతమ బుద్ధుడు. బుద్ధుడు మనిషిని ప్రాణాపాయం నుండి కాపాడి ,మంచి మార్గం చూపెట్టి ,భయంకరమైన పరిస్థితి నుండి బయటకు తీసుకుని రావాలని ప్రయత్నం చేసేవారు.ఎవరైతే శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిబ్బాణం కోసం ప్రయత్నం చేయకుండా ,తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతుంటారు.ఈ తాత్కాలిక సుఖాల కోసం ప్రాపంచిక సుఖాల కోసం కష్టాల పాలవుతూ ఉంటారు.దీంతో మనిషి నూతిలో భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా దయగల మనిషి అందించిన సాయాన్ని తీసుకోలేదు.తాత్కాలిక ఆనందాన్ని కలిగించే తేనె చుక్కల కోసం మూర్ఖుని వలె ప్రవర్తించాడు.మనిషి శారీరక, మానసిక బాధల నుండి ,అసంతృప్తుల నుండి బయట పడే ప్రయత్నం చేయాలి. అలా చేయని మనిషిని దుక్ఖం ఆవరిస్తుంది. మరణానికి చేరుకుంటాడు.మనిషి జీవితం ఎందుకు అనే కారణం తెలుసుకోకుండా మరణించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ జీవితం ఆనందంగా జీవించడానికి ,పరులకు మేలు చేయడానికి.

అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది