పాత రిజర్వేషన్ ప్రాతిపాదికన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు

పాత రిజర్వేషన్ ప్రాతిపాదికన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు
- 42% బీసీ రిజర్వేషన్ తాత్కాలికంగా నిలిపివేత
- పాత రిజర్వేషన్ ప్రాతిపదికన నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
- పాత రిజర్వేషన్ ఆధారంగా రానున్న ఎన్నికల నోటిఫికేషన్
హైదరాబాద్, అక్టోబర్ 11 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాలు, బీసీ సంఘాల్లో చర్చలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయలేదని. పాత రిజర్వేషన్ విధానాన్ని ఆధారంగా చేసుకుని ఓపెన్ కేటగిరీ సీట్లను నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు సూచించింది.ప్రభుత్వం కొత్తగా నిర్ణయించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల్లో పూర్తి స్థాయి కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని సూచించింది. పిటిషనర్లకు ఆ కౌంటర్‌పై తమ అభ్యంతరాలు సమర్పించడానికి రెండు వారాల సమయం కూడా ఇచ్చి పూర్తి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.
పిటిషనర్లు వాదించినట్లుగా, బీసీ రిజర్వేషన్ల పెంపు ‘ట్రిపుల్ టెస్ట్’ సూత్రానికి విరుద్ధమని చెప్పగా, ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది డా. అభిషేక్ మానూ సింఘ్వీ వాదనలు వినిపించారు. కోర్టు, రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించరాదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలను గుర్తు చేసింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా బీసీ సంఘాలు దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తున్నాయి. ఈ తీర్పుతో, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ సమీకరణాలు మళ్లీ తారుమారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో పాత విధాన పద్ధతిలో ఎన్నికల వెళ్లే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.