ఫీనిక్స్ పక్షిలా పైకి లేద్దాం!

ఫీనిక్స్ పక్షిలా పైకి లేద్దాం!
నాపై నమ్మకంతో ఓట్లేసిన ప్రజలు…. పని చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు
పదవి ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటా
మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం. రంజిత్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ న్యూస్// వికారాబాద్ జిల్లా// నవాబుపేట్ మండలం//
ఇటీవల జరిగిన చేవెళ్ళ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ… తన కోసం అహర్నిశలు కృషి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులకు మాజీ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని… పదవులు ఉన్నా లేకున్నా తన ప్రజా సేవ ఆగదని చెప్పారు. ఈ ఎన్నికల్లో చేవెళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించామని తెలిపారు. అయితే, ఎన్నికల ఫలితం తమ అంచనాలకు భిన్నంగా వచ్చిందని అన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలందరికీ తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పునరుద్ఘాటించారు. గత రెండు మూడు నెలల పాటు సాగిన ఎన్నికల మహత్తర పోరాటంలో చేవెళ్ల ప్రజల తీర్పును తాను నిండు మనసుతో గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎప్పటిలాగే అభివృద్ధి, అందుబాటు అనే నినాదంతోనే చేవెళ్ల ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం ప్రజాసేవలో భాగం అవుతానని చెప్పారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులు ఎవరూ చింతించాల్సిన పని లేదని… ప్రజలకు మరింత చేరువు అయ్యేందుకు కృషి చేయాలని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మనమంతా కష్టబడి ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు… ఫీనిక్స్ పక్షి మాదిరి కింద నుంచి పైకి వస్తామని రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే, కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం తాను వారం రోజుల పాటు అందుబాటులో ఉండటం లేదని… వారం తర్వాత ప్రజా సేవలో నిమగ్నం అవుతానని ఆయన చెప్పారు.