కేటాయించిన ఇళ్లను అమ్మినట్లయితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.

కేటాయించిన ఇళ్లను అమ్మినట్లయితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.
జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి ప్రతినిధి:
గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంచి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా భూపాలపల్లి మండల పరిధిలోని వెలిశాలపల్లి గ్రామంలో రెండు పడక గదుల ఇండ్లను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కాలనీలో ఏర్పాటు చేసిన మంచినీటి సంపు ను పరిశీలించి సంపు యొక్క నిలువ నీటి సామర్ధ్యాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కాలనీలోని నాలుగవ అంతస్తు బిల్డింగ్ ఎక్కి నీటి సరఫరాకు ఏర్పాటు చేసిన ట్యాంక్ లను పరిశీలించారు. తర్వాత కాలనీ ప్రజలతో మంచినీటి సరఫరాపై కలెక్టర్ ముకాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇళ్లను అమ్మినట్లైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సగటున ఒక కుటుంబం అద్దె ఇంట్లో ఉంటే కనీసం 2 వేల నుండి 3 వేలు అద్దె చెల్లించాల్సి వస్తుందని అది సంవత్సరానికి దాదాపు 30 వేలు అవుతుందని, అద్దె కట్టలేని నిరు పేదలను గుర్తించి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించామని కలెక్టర్ అన్నారు. కేటాయించిన ఇళ్లను లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సంతోషంగా ఉండాలి కానీ ఇళ్లను అమ్ముకోవడం సరైంది కాదని కలెక్టర్ అన్నారు. ఇందుకనుగుణంగా కాలనీ లో ఏర్పాటు చేసుకున్న సొసైటీ కమిటీ ఎవరైనా లబ్ది దారులు ఇళ్ళు అమ్మిన లేదా వేరే వారికి కిరాయి ఇచ్చినట్లైతే మునిసిపల్ అధికారులకు తెలియ చేయాలని అన్నారు. అలాగే కాలనీలో ఏదేని సమస్యలు వస్తే కుటుంబానికి మీ పరిధిలో నిర్వహణకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్లంబర్, వాటర్ మెన్ ఇతరత్రా అవసరాల
రీత్యా నగదు అవసరం అవుతుందని లబ్ధిదారులు ప్రతి నెలా కాలనీ నిర్వహణకు కొంత నగదు జమ చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు డ్రైనేజితో పాటు కాలనీ చుట్టూ ప్రహారి గోడ నిర్మించాలని, కాలనీకి సరిపడు విద్యుత్ సరఫరాకు ట్రాన్సుఫార్మర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. ఇందుకనుగుణంగా క్రమేపి విడతల వారిగా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డి ఈ వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ రాజేశ్వర్,
ఏ ఈ రోజా తదితరులు పాల్గొన్నారు.
