లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్ఐ

  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు
  • వివరాలను వెల్లడించిన మెదక్ ఏసిబి డీఎస్పీ సుధాకర్

రామచంద్రాపురం,జనవరి2( జ్ఞాన తెలంగాణ):

కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ ఎం.రమేష్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ వలలో చిక్కుకున్నాడని అన్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 17, 2025న పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని కొల్లూరు పోలీసులు పట్టుకుని కేస్ నమోదు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడి పేరు తొలగించేందుకు ఎస్‌ఐ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొదట రూ.30 వేల లంచం కోరిన ఎస్‌ఐ, ఇందులో భాగంగా గత నెల 17న రూ.5 వేలు ఇప్పటికే తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. తాజాగా మిగిలిన రూ.20 వేలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్‌ఐని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారనీ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని చెప్పారు. అదేవిధంగా లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయాలని, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే ప్రజలు టోల్‌ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు.

You may also like...

Translate »