ఎలైట్ రైటర్స్ అసోసియేషన్లో కీలక బాధ్యతలు


– రఘుపతిరావు, మంజులా సూర్యల ఎంపిక
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :
సాహిత్యంలో కథ, కవిత, విమర్శ వంటి విభిన్న ప్రక్రియల్లో ప్రతిభ కనబరిచే రచయితలను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎలైట్ రైటర్స్ అసోసియేషన్లో కీలక నియామకాలు జరిగాయి. ప్రముఖ సాహితీవేత్త, ఐబీఆర్ఎఫ్ సభ్యులు డా. చిటికెన కిరణ్ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్న ఈ సంస్థలో ఇద్దరు ప్రముఖ రచయితలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ రాష్ట్రం వేములవాడ పట్టణానికి చెందిన కథా రచయిత, విమర్శకుడు గడప రఘుపతిరావు, హైదరాబాద్ నగరానికి చెందిన ప్రసిద్ధ కవయిత్రి మంజులా సూర్యలను ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు డా. చిటికెన కిరణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. సాహిత్య రంగంలో వీరిద్దరూ చేసిన సేవలు, వారి సృజనాత్మక రచనలు ఈ ఎంపికకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డా. చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సమకాలీన సాహిత్యంలో నాణ్యతతో కూడిన రచనలను ప్రోత్సహించడం, కొత్త రచయితలకు వేదిక కల్పించడం, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న సాహిత్య ప్రతిభను వెలికి తీయడం ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, కథా చర్చా వేదికలు, విమర్శా కార్యక్రమాల్లో కొత్తగా నియమితులైన కార్యనిర్వాహక కార్యదర్శులు చురుకుగా పాల్గొని సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
గడప రఘుపతిరావు కథా రచయితగా, విమర్శకుడిగా తన రచనల ద్వారా సామాజిక అంశాలను సున్నితంగా, ప్రభావవంతంగా ఆవిష్కరించడంలో విశేష గుర్తింపు పొందారు. అలాగే మంజులా సూర్య తన కవిత్వంలో స్త్రీ అనుభూతులు, సామాజిక చైతన్యం, మానవీయ విలువలను ప్రతిబింబిస్తూ పాఠకుల ఆదరణను పొందుతున్నారు. వీరిద్దరి అనుభవం సంస్థ కార్యకలాపాలకు మరింత దిశానిర్దేశం చేయనుందని సాహిత్య వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నియామకాలపై సంస్థ నిర్వాహకులు కందాళ పద్మావతి, కట్టెకోల విద్యుల్లత, రామగిరి సుజాత, వసంత లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేస్తూ, నూతన బాధ్యతలు స్వీకరించిన రఘుపతిరావు, మంజులా సూర్యలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని సంస్థ అడ్వర్టైజింగ్ మీడియా ఇంచార్జ్ ఎన్. శ్రీకాంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
