జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతా

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన వేముల మహేందర్ గౌడ్*జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి చిన్న పేపర్, పెద్ద పేపర్ అనే తేడా లేకుండా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధ సంఘమైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వేముల మహేందర్ గౌడ్ అన్నారు.

సమాజ సేవయే..తన ఊపిరిగా భావించే జర్నలిస్టులు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారని, వార్తలు సేకరించే క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారని, దాడులు సైతం జరుగుతున్నాయని, జర్నలిస్టులపై దాడులు చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కలం వృత్తినే నమ్ముకుని జీవన పోరాటాన్ని సాగిస్తున్న జర్నలిస్టులు అర్ధాకలితో అలమటిస్తున్నారని, ప్రజాసేవయే పరమావధిగా భావించే జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి..వాటిని పరిష్కరించే దిశలో కృషి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) యూనియన్ జర్నలిస్టులు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్యల ఆదేశాల మేరకు వేముల మహేందర్ గౌడ్ ను టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షులు పర్కాల సమ్మయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టుగా, నిరంతరం తన కలంతో ప్రజా గలాన్ని వినిపించే మహేందర్ గౌడ్ సేవలను వినియోగించుకోవాలనే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా బాధ్యులకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మంద జగన్, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాటూరి రవీందర్ గౌడ్, మొగుళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు..టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గం సురేష్ గౌడ్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి..టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్, టిడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మల భద్రయ్య, మురహరి మనోజ్, పాత్రికేయులు వేముల కిరణ్ గౌడ్, చెక్క శ్రీధర్, తంగళ్ళపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »