అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న మహాకవి కాళోజి మాటలు
శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ అయిన కవిత్వాన్ని సొంతం చేసుకున్న అలిశెట్టి ప్రభాకర్ కలం నుండి జాలువారి, హృదయాలను కదిలించే కవితాక్షరాలకు సరిగ్గా సరిపోతాయి. అలిశెట్టి ప్రభాకర్ అనేది నిజానికి వ్యక్తి పేరు కాదు. అగ్ని జ్వాలా మయమైన కవితా శక్తి పేరు. …ఉప్పొంగే భావావేశానికి మామూలుగా కవులు అక్షరాలను అద్దితే, అలిశెట్టి కవితకు తన చెమటను, ఆపై రక్తాన్ని అద్దాడు. ఊపిరిని ఫణంగా పెట్టి అక్షరానికి ప్రాణ ప్రతిష్ట చేశాడు. సామాజిక సమస్యలపై కలంతో పోరాడి, తన పోరాట మాధ్యమం కవిత్వమే అని భావించి, కెమెరా కన్ను…కుంచె గన్ను…కవాతు పెన్నుల ఏకీకరణతో, కవిత కోసమే బతికాడు. కవిత కోసమే ప్రాణాలిచ్చాడు. కుటుంబ పోషణార్దం ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్నప్పటికీ, తాను జీవించ డానికి కవిత్వాన్నే ఆహారంగా తీసుకుని, మరణానికి భయపడక, పరిస్థితులలో రాజీ పడలేక, ఆశయాల కోసం దేహాన్నే ఫణంగా పెట్టి అమారుడైనాడు అలిశెట్టి. అలిశెట్టి కవిత్వం ఒక్కసారి చదివితే చాలు, నిద్రాణంగా ఉన్నవాణ్ని సైతం నినాదమై మేల్కొల్పుతుంది.
అలిశెట్టి ప్రభాకర్ నేటి జిల్లా కేంద్రమైన జగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టాడు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు గల పెద్ద కుటుంబంలో జన్మించగా, తండ్రి ఆకస్మికంగా మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన ‘భాగ్యం’ ను పెళ్ళి చేసుకొన్నారు. జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. జగిత్యాల, కరీంనగర్, ఆపై1982 లో హైదరాబాదుకు మకాం మార్చాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా, సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరం కవితా వస్తువు గా, మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించాడు. ఆయన మొదట చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు.
సిరిసిల్లలో రాం ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో “పూర్ణిమ” స్టూడియో ప్రారంభించాడు. కరీంనగర్‌లో స్టూడియో “శిల్పి” (1979), హైదరాబాద్లో స్టూడియో “చిత్రలేఖ” (1983) పేర్లతోనూ స్టూడియోలు నడిపి ఫోటో గ్రాఫర్‌గా జీవితాన్ని గడిపాడు.
జగిత్యాలలో “సాహితీ మిత్ర దీప్తి సంస్థ” పరిచయంతో కవిత్వ రంగంలో ప్రవేశించాడు. పేదరికం, ఆకలితో సహవాసం చేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. నిరుద్యోగం, నగర జీవితం గురించి కవితలు అల్లాడు. మెజారిటీ ప్రజల బాధలూ, గాధలే తన కవిత్వానికి ముడి సరుకని చెప్పుకున్నాడు. ‘గొర్రె మందతో నడిచేకంటే.. చీమల బారులో చేరితే మేలు’ అనే భావించాడు.
1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చులో కనిపించిన అలిశెట్టి మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) అచ్చైన ఆయన మొదటి కవితా సంకలనం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా “సిటీ లైఫ్” పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన “మినీ కవితల”తో ప్రఖ్యాతి పొందాడు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వం రాశాడు. ఎర్ర పావురాలు (1978), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభ గీతం (1990), సిటీ లైఫ్ (1992), తదితర ప్రసిద్ధ కవితలు అచ్చులో వచ్చాయి.
తను శవమై../ఒకరికి వశమై…/తనువు పుండై…/ఒకడికి పండై../ఎప్పుడూ ఎడారై…/ఎందరికో ఒయాసిస్సై..’లో ఉన్నవి మొత్తం పన్నెండు పదాలే. సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి రాసిన అలిశెట్టి కవిత అల్ప పదాలలో అనల్ప భావాలను అద్దుకుని, సుప్రసిద్దమైనది. వేశ్యల గురించి ప్రస్తావన వచ్చిన అనేక సందర్భాలలో అనేక మందిచే ఉదహరింపబడిన కవిత.
హృదయ త్రాసు కవిత ఆయనకు కవిగా మంచి పేరు తెచ్చినదే. ఉదహరింపు కవితలో … ప్రతిభలేకపోతే జీవితం వ్యర్థం అని, సాధన చేస్తేనే బండ శిల్పంగా మారుతుందని, కాలానికి వదిలేయకుండా ప్రయత్నం చేయాలని, చిన్న కవితలో ఎంతో అందంగా చెప్పాడు ప్రభాకర్.
జీవితం అనే మినీ కవితలో మనిషి ప్రకృతిని చూసి ఎంతో నేర్చుకోవలసినది ఉందంటాడు. చిన్న విత్తనం నుంచి బయటకు వచ్చిన మొక్క, మానుగా మారి కొమ్మలు, రెమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఆకాశం అంత ఎత్తును చూస్తుంది. అంతేకాదు, తాను సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆశ్రయించినవారికి నీడ ఇస్తుంది. సమాజంలో పుట్టిన వ్యక్తి కూడా స్వార్థ చింతన మానుకుని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుని తనకు, తన కుటుంబానికే కాక సమాజానికి ఉపయోగపడాలి అనే సందేశాన్ని ఎంతో తేలికైన మాటలతో, . జీవితంలో నిరాశావాదానికి చోటులేదని,వృక్షం స్వయంకృషికి ప్రతీక అని వివరించాడు.
అలిశెట్టి కవిత ‘రక్తరేఖ’లో … ‘‘నువ్వు ఉరిమి చూసినప్పుడు ఊరంతా పాలేర్లే వాళ్ళే ఊరినించి తరిమికొడితే నీ బ్రతుకంతా పల్లేర్లే’’ అంటూ భూస్వాములను హెచ్చరించడం, అలాగే..‘‘పుస్తకం లోంచి దులిపేసిన అక్షరాల్లా లక్షకి లక్షలు దేశమంతా నిరుద్యోగులై నిండుకున్నారు’’ అంటూ నిరుద్యోగం గురించి, తన కవిత్వంలో ముక్కు సూటిగా, పదునుగా, ఘాటుగా, విమర్శించిన భావావేశపు తీరు తెలుగులో`కవిత్వంలో బహు అరుదు.
‘‘‘జలగాలు’ ‘బ్రహ్మ’జెముళ్ళూ అవకాశవాది ‘రూలుకర్రా’ ‘ఆరణాల కూలీ’ ‘పునాది’లేని ‘భవనం’ నాచారం ‘సన్యాసులూ ’ అంతర్గత కలహాలు, తరుచూ సీఎంల మార్పులు… ముఖ్యమంత్రులు ఎవరైనా, అక్షరాలా అరాచకంలో మార్పుండదు’’ అని చెపుతూ, కాసు, జలగం, అంజయ్య, భవనం, చెన్నారెడ్డి, ఎన్టీఆర్, నాదెండ్ల ఇలా ఆనాటి ముఖ్యమంత్రుల తీరు పైనా పెన్నును గురి పెట్టాడు.
జగిత్యాలో ఉన్న సమయంలో అలిశెట్టి కవితలు రాయడం, పోస్టు చెయ్యడమే ప్రధాన కార్యక్రమంగా చేసుకున్నాడు. తాను అనుభవించిన పేదరికం, దగ్గర నుండి చూసిన అణగారిన వర్గాల బ్రతుకు వెతలకు కల్పించిన అక్షర రూపాలు సమ కాలీన కవులపై తీవ్ర ప్రభావం చూపాయి. మార్గ నిర్దేశనం చేశాయి. తన కవిత్వంలో మహిళల పట్ల ప్రేమ, ఆర్తిని కలగలిపడంతో పాటు, దళిత, ముస్లిం, చేనేత, గౌడ బతుకుల వెతలను, రైతు, కార్మికుడు, విద్యార్థి, ఇలా అందరి సమస్యలను కవితా అంశాలుగా చేసుకున్నాడు.
గాడి తప్పుతున్న సమాజాన్ని, అడుగంటుతున్న మానవీయ విలువల్ని హృదయంతో చూసి, రక్తం రంగరించి రాశాడు. కవిత్వమంటే ఏమిటో తాను 1978లో ప్రకటించిన తొలి కవితా సంకనం ‘ఎర్రపావురాలు’ లో ‘‘నా గుప్పిట్లో మండుతున్న ఎన్నో గుండెలు … ఒక్కొక్కదాన్లో దూరి, వాటిని చీరి , రక్తాశ్రువులు ఏరి పరిశీలిస్తాను నేను’’ అన్నాడు.
కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చాడు. రెండున్నర దశాబ్దాల కింద శరీర్రాన్ని త్యజించినా, ఆయన కవిత్వం మాత్రం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై నిరంతరం స్ఫురణకు వస్తూనే ఉంది.
సమాజ మార్పుని ఆకాంక్షిస్తూ పేదరికానికి బలైన కవి. ’మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించాడు. అందుకేనేమో ఈ అరుదైన కవి అలిశెట్టి పుట్టిన, గిట్టిన తేదీలు ఒకటే అయి, మళ్లీ మళ్లీ పుడుతూ సమాజ పరిస్థితులపై తాను రాసిన కవితల ద్వారా సమరం సాగిస్తూనే ఉన్నాడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా కొనసాగుతూనే ఉన్నాడు.