ధర్మయుద్ధం చేసిన భారత్…

- పాపయుద్ధం చేసిన పాక్
- శాంతి పేరుతో న్యాయాన్ని మింగే ప్రయత్నం ఇదేం నీతి
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై నిర్దిష్టంగా దాడులు చేసి ధర్మయుద్ధం నిర్వహించగా, పాకిస్తాన్ మాత్రం నీతి మరచి భారతదేశంలోని అమాయక పౌరులపై ఉగ్రవాదంలా దాడులు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పౌర నగరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడుల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాల కన్నా విలువైనదేదీ లేదన్న భావనతో, ఈ దాడులు భారతీయుల గుండెల్లో దుఃఖాన్ని మాత్రమే కాకుండా కోపాన్ని కూడా రేపాయి.
భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని న్యాయసమ్మతంగా స్పందించగా, పాకిస్తాన్ అనేక నగరాల్లో సాధారణ ప్రజల నివాస ప్రాంతాలపై విచక్షణారహితంగా మిస్సైల్, డ్రోన్ దాడులు జరిపింది. వాస్తవానికి భారత్ కూడా పాక్ విధానాన్ని అనుకరిస్తే — పాక్‌లోని అమాయకులు ఎంతోమంది బలయ్యేవారు. కానీ భారతదేశం మానవతా విలువలు, శాంతి విధానాన్ని కాపాడుతూ తన బలాన్ని నియంత్రించుకుంది. ఇదే భారతీయత.
ఈ తరుణంలో, మే 10న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందం పై అంగీకరించాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. అమెరికా, 36 దేశాల దౌత్య మద్దతుతో ఈ ఒప్పందాన్ని సాధించగలిగింది.
ఇప్పటికే పాకిస్తాన్ తన గగనతలాన్ని తిరిగి తెరిచింది, భారత్ కూడా ప్రతిస్పందనగా శాంతియుత చర్యలు కొనసాగిస్తోంది. కానీ ప్రజలలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది.
ఈ శాంతి ఒప్పందం శాశ్వతంగా నిలవాలన్నది ప్రతి మనసులో ఆశ. కానీ ఈ యుద్ధంలో బలైపోయిన మా భారతీయుల ప్రాణాలు మాకు శాశ్వతమైన వెలితిని మిగిలించాయి.
-జ్ఞాన తెలంగాణ ప్రతినిధి రత్నం నాని
