భార్య పెట్టిన కండిషన్ ను ఇప్పటికీ పాటిస్తున్నాను: మురళీమోహన్!

 భార్య పెట్టిన కండిషన్ ను ఇప్పటికీ పాటిస్తున్నాను: మురళీమోహన్!

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో అతడు
  • 2005లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం
  • తాజాగా రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న అతడు
  • మురళీమోహన్ ప్రెస్ మీట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 2005లో వచ్చిన ‘అతడు’ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు మురళీమోహన్ నిర్మించారు. ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో, అతడు మూవీని కూడా కొత్త హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆగస్టు 9న అతడు రీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

అతడు సినిమాలో మీరెందుకు నటించలేదని ఓ మీడియా ప్రతినిధి మురళీమోహన్ ను అడిగారు. అందుకాయన బదులిస్తూ, తన భార్య పెట్టిన కండిషన్ కారణంగానే తాను ఆ సినిమాలో నటించలేదని తెలిపారు. 

“అతడు సినిమాలో నాకు పాత్ర ఇవ్వలేదు. నేను సినీ పరిశ్రమలోకి రావాలనుకున్న తొలినాళ్లలో మా ఆవిడ ఓ కండిషన్ విధించింది. నేను ఎవరి వద్దకు వెళ్లి పాత్రను అడగకూడదు అని స్పష్టం చేసింది. కెరీర్ అంతా కూడా నా వద్దకు వచ్చిన పాత్రలనే చేస్తూ వచ్చాను. ఇప్పటికీ అదే రూల్ పాటిస్తున్నాను. అందుకే అతడు చిత్రంలో నేను కనిపించలేదు” అని మురళీమోహన్ వివరించారు. 

ఇక, మహేశ్ బాబు, త్రివిక్రమ్ ఓకే అంటే అతడు  చిత్రానికి సీక్వెల్ తీస్తానని వెల్లడించారు. ఆ సినిమాను వాళ్లిద్దరితో తప్ప వేరే వాళ్లతో అయితే తీయనని స్పష్టం చేశారు.

You may also like...

Translate »