భార్యను కర్రతో కొట్టి హత్య చేసిన భర్త

  • అమీన్ పూర్ పరిధిలోని వడక్ పల్లి లో చోటు చేసుకున్న ఘటన..
  • గతంలోనూ వేధింపుల కేసులో జైలుకెళ్లిన భర్త..
  • ఘటన స్థలానికి పరిశీలించిన పటాన్ చెరు డిఎస్పి ప్రభాకర్, అమీన్ పూర్ సీఐ నరేష్..
  • కేసు నమోదు చేసి.. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

అమీన్‌పూర్,అక్టోబర్‌ 31 (జ్ఞాన తెలంగాణ):

దంపతుల మధ్య జరిగిన కుటుంబ గొడవ భార్య ప్రాణాలను బలిగొంది. భర్త కర్రతో భార్యపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా,అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వడక్ పల్లిలో చోటుచేసుకుంది.అమీన్ పూర్ సీఐ నరేష్ అందించిన సమాచారం ప్రకారం ఇందల్వాయి మండలం త్రియంబకపేట్ గ్రామానికి చెందిన బానోత్ రాజు (46) తన భార్య బానోత్ సరోజ (35)తో 2005లో వివాహం చేసుకున్నాడు. దంపతులకు ఒక కుమార్తె బానోత్ వినోద (18), కుమారుడు బానోత్ విశాల్ (16) ఉన్నారు.గత ఆరునెలల క్రితం జీవనోపాధి కోసం వీరు బీరంగూడకు వలస వెళ్లి కూలీ పనులు చేస్తూ ఉండేవారు. అనంతరం వడక్ పల్లి గ్రామ శివారులో గంగుల రామిరెడ్డి పౌల్ట్రీ ఫామ్ సమీపంలోని చెరుకూరి ప్రసాద్‌ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో కూలీ పనులు చేస్తున్నారు.

31 అక్టోబర్‌ రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన రాజు కర్రతో భార్య సరోజను బలంగా కొట్టాడు. గాయాల తీవ్రతతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.మృతురాలి తల్లి బడవత్ చంగిబాయి,బిబిపూర్ తండా, దిచ్పల్లి మండలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిచ్పల్లి పోలీసులు క్రైమ్ నంబర్‌ 308/2023, సెక్షన్‌ 307 ఐపిసి హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.అనంతరం మృతిచెందినట్లు తేలడంతో సెక్షన్‌ 302 ఐపిసి హత్యగా కేసు మారుస్తామని పోలీసులు తెలిపారు.గతంలోనూ బానోత్ రాజు తన భార్యను వేధించిన కేసులో దిచ్పల్లి పోలీసులచే అరెస్టై జైలుకెళ్లినట్లు సమాచారం. సంఘటన స్థలానికి పటాన్ చెరు డిఎస్పి ప్రభాకర్,అమీన్ పూర్ సీఐ నరేష్ చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా,భర్త రాజును అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

You may also like...

Translate »